తల్లి శవంతో మూడురోజులుగా గదిలోనే..

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. తల్లి శవంతో ఓ కొడుకు మూడురోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. విష్ణుపురి కాలనీలోని మైత్రి నివాస్ అపార్టుమెంట్ 202 ఫ్లాట్‎లో 50 ఏళ్ల విజయ, మానసిక స్థితి సరిగాలేని 25 సంవత్సరాల కొడుకు సాయికృష్ణతో కలిసి ఉంటోంది. అయితే ఈ రోజు ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో అపార్ట్‎మెంట్ వాసులు పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో పోలీసులు వెళ్లి తలుపులు తీసి చూడగా.. విజయ చనిపోయి కుళ్లినపోయిన స్థితిలో పడి ఉంది. ఆమె చనిపోయి దాదాపు మూడు రోజులు అయి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. సాయికృష్ణ మానసిక స్థితి సరిగా ఉండదని.. ఈ విషయంలో తల్లికొడుకులిద్దరూ తరచుగా గొడవపడేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో సాయికృష్ణే తల్లిని చంపి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.