వైద్యారోగ్య శాఖ‌లో స‌కాలంలో వేత‌నాల చెల్లింపుకు ప్ర‌త్యేక సాఫ్ట్ వేర్

హైద‌రాబాద్‌: వైద్యారోగ్య శాఖ‌లో వేత‌నాల చెల్లింపులో జాప్యం జ‌రుగ‌కుండా తెలంగాణ స‌ర్కారు శాశ్వ‌త ప‌రిష్కారం చూప‌నున్న‌దని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హౌస్ సర్జన్లు, జూనియర్ డాక్టర్స్, సీనియర్ రెసిడెంట్ డాక్ట‌ర్ల‌కు స్టైఫండ్‌తోపాటు డైట్‌, పారిశుధ్య‌ విభాగాల్లో ప‌నిచేసే సిబ్బంది, ఇత‌ర కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, నర్సులకు మాన్యువల్ బిల్లుల విధానం ద్వారా చెల్లింపులు జరుగుతుండడంతో కొంత ఆలస్యం అవుతున్న‌దన్నారు.

హైద‌రాబాద్‌లోని బీఆర్‌కే భ‌వ‌న్‌లో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, సంబంధిత అధికారులతో మంత్రి హ‌రీశ్‌రావు గురువారం సమీక్ష స‌మావేశం నిర్వహించారు.

బిల్లులను స్క్రూటినీ చేయడం, ఉన్నతాధికారులకు పంపడం, ప్రభుత్వం ఆమోదం తీసుకోవడంలాంటి పద్ధతుల వల్ల జాప్యం జరుగుతున్న‌ట్లు గుర్తించామని.. దీన్ని సమూలంగా నివారించేందుకు ఆన్‌లైన్‌ విధానంలో చెల్లింపులు చేయాల‌ని అధికారులను ఆదేశించినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాప్ట్ వేర్ రూపొందించాలని అధికారులకు మంత్రి సూచించారు.

వైద్యారోగ్య శాఖలో పని చేసే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి సకాలంలో వేతనాలు అందేలా చూడాలని… హౌస్ సర్జన్లు, జూనియర్ రెసిడెంట్స్, సీనియర్ రెసిడెంట్స్ వేతనాలు చెల్లింపులో ఎలాంటి ఆలస్యం జరుగ కూడదని ఆదేశించారు. తక్షణం ఆన్ లైన్ విధానం రూపొందించి, ఆర్థిక, అరోగ్య శాఖ సమన్వయం చేసుకొని ఏ నెలకు ఆ నెల వేతనాలు చెల్లింపులు జరిగే విధంగా చూడాలన్నారు. వేత‌నాలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప‌డేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్బంగా ఆర్థిక, అరోగ్య శాఖ అధికారులు వేతనాల చెల్లింపులు సత్వరం చేసే అంశంపై మంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.