శ్రీశైలం.. క్యూలైన్లలోకి దూసుకొచ్చిన వ్యాన్

van-brake-failed-at-srisailam temple premises

శ్రీశైలం దేవాలయం దగ్గర భారీ ప్రమాదం తప్పింది. ఉదయం బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో అదుపు తప్పిన ఓ డీసీఎం వ్యాన్‌.. ఆలయ దక్షిణ మాడవీధిలోని క్యూలైన్లలోకి దూసుకువచ్చింది.

ఉదయం తొమ్మిది గంటల సమయంలో లడ్డూ తయారీ కేంద్రానికి అవసరమైన ముడిసరుకులు, నెయ్యి దించేందుకు వచ్చిన విజయ డెయిరీకి చెందిన వ్యాన్‌ రెండో నంబర్‌ గేట్‌ దగ్గర నిలిపారు.

సిబ్బంది వాహనం నుంచి నెయ్యిని తరలిస్తుండగా లారీ హైడ్రాలిక్‌ బ్రేక్‌ ఫెయిల్‌ అయి నెమ్మదిగా కిందకు కదిలింది. డొనేషన్‌ కౌంటర్‌, ఆర్జిత సేవా, సామాన్లు భద్రపరిచే క్లాక్‌రూం మీదుగా క్యూలైన్లను దాటుకుంటూ ఉచిత క్యూలైన్‌ దగ్గరకు వచ్చి ఆగిపోయింది.

వ్యాన్ హైడ్రాలిక్‌ బ్రేక్‌ ఫెయిల్‌ అయిన విషయాన్ని గమనించిన డ్రైవర్‌ అదుపు చేసేందుకు ప్రయత్నించాడు. మరో వైపు సెక్యూరిటీ గార్డులు కాశి, సురేష్‌ భక్తులను అప్రమత్తం చేస్తూ అందరినీ ప్రమాదం నుంచి కాపాడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.