ధోనీ హెలికాప్టర్ షాట్ ఎలా పుట్టిందో తెలుసా.. ఇదే అసలు కథ! - TNews Telugu

ధోనీ హెలికాప్టర్ షాట్ ఎలా పుట్టిందో తెలుసా.. ఇదే అసలు కథ!మహేంద్రసింగ్ ధోని గురించి క్రికెట్ ప్రేమికులకు, క్రీడాభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో కష్టపడి ఎదిగిన ధోనీ.. తన ఆటతీరు, మైదానంలో ప్రవర్తిన తీరుతో మిస్టర్ కూల్, బెస్ట్ ఫినిషర్ అనిపించుకుని ప్రపంచవ్యాప్తంగా అభిమాలనులను సంపాదించుకున్నాడు. సీనియర్ క్రికెటర్లు సైతం ధోనీ ఆటతీరుకు ముగ్ధులైన సందర్భాలున్నాయి. స్టంప్ కొట్టడంతో వరల్డ్ ఫాస్టెస్ట్ కీపర్ అనిపించుకున్నాడు ధోని. ధోని బ్యాటింగుకు దిగాడంటే.. అతడి హెలికాప్టర్ షాట్ ని అస్సలు మిస్ కారు. ఏ బాల్ వేసినా సరే.. ధోని షాట్ కొట్టాలనుకుంటే అది బౌండరీగా మారాల్సిందే. హెలికాప్టర్ షాట్ తో కండ్లు చెదిరే బౌండరీలు బాదడం ధోనికి వెన్నతో పెట్టిన విద్య.

బ్యాటర్ ని ఎలాగైనా ఔట్ చేయాలి అని బౌలర్ సంధించే యార్కర్ బంతులకు ఎంతటి సీనియర్ బ్యాట్స్ మెన్ అయినా అప్పుడప్పుడు చేతులెత్తేయక తప్పదు. అయితే.. ధోని మాత్రం ఎంతటి యార్కర్ బాల్ అయినా సరే.. దాన్ని అమాంతం స్టాండ్స్ లోకి పంపి చిరునవ్వులు చిందిస్తాడు. తనదైన సిగ్నేచర్ షాట్ హెలికాప్టర్ షాట్ కొట్టాడంటే స్టేడియం మొత్తం ఈలలు, చప్పట్లతో మోత మోగాల్సిందే. అయితే.. హెలికాప్టర్ షాట్ కొట్టాలంటే టెక్నిక్ ఒక్కటే సరిపోదు.. ఎంతో ప్రాక్టీస్.. టైమింగ్ మీద కూడా పట్టుండాలి. ఈ విషయంలో ధోని ఆరితేరాడు. అసలు.. ధోనికి హెలికాప్టర్ షాట్ ఐడియా ఎలా వచ్చింది? హెలికాప్టర్ షాట్ కథేంటి?

 

 

హెలికాప్టర్ షాట్ కనిపెట్టిన స్నేహితుడు సంతోష్ లాల్ తో ధోని
హెలికాప్టర్ షాట్ కనిపెట్టిన స్నేహితుడు సంతోష్ లాల్ తో ధోని

 

ఆ షాట్ కనిపెట్టింది ధోనీ కాదు..
2006లో గోవాలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డేలో ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ వేసిన ఫుల్ లెంగ్త్ బాల్ ని ధోని.. తనదైన స్టైల్ లో సిక్స్ కొట్టాడు. అయితే.. అప్పటి వరకు ఆ షాట్ పేరు, తీరు ఎవరికీ తెలియదు. దాన్ని హెలికాప్టర్ షాట్ అంటారని కూడా ఎవరికీ తెలియదు. అయితే.. ఓ కూల్ డ్రింక్ కంపెనీ యడ్ లో ఆ షాట్ ను హెలికాప్టర్ షాట్ అని ధోని చెప్పడంతో అప్పటి నుంచి ఆ షాట్ ను హెలికాప్టర్ షాట్ అని పిలుస్తున్నారు. వికెట్ల మీదకు దూసుకొస్తున్న యార్కర్ ను క్రీజులోంచి బయటకు రాకుండా ప్లిక్ చేసి లెగ్ సైడ్ అమాంతం బౌండరీ అవతలికి పంపే ఈ షాట్ ను తొలిసారి కొట్టింది ధోని కాదు.. సంతోష్ లాల్ అనే క్రికెటర్. అయితే ధోని ఈ షాట్ కొట్టిన తర్వాత హెలికాప్టర్ షాట్ కి క్రేజ్ పెరిగింది. ధోని మార్క్ షాట్ గా జనాలకు గుర్తుండి పోయింది.


స్నేహితుడి గుర్తుగానే ఆ షాట్..
ఆ సంతోష్ లాల్ ఎవరో కాదు.. ధోని చిన్ననాటి ఫ్రెండ్. హెలికాప్టర్ షాట్ ని కనిపెట్టింది ఇతడే. జార్ఖండ్, బీహార్ తరపున ఎనిమిది ఫస్ట్ క్లాస్ మ్యాచులకు సంతోష్ లాల్ కెప్టెన్సీ చేశాడు. ఏడు సంవత్సరాలు రంజీ మ్యాచులు ఆడాడు. ధోనితో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. 2013లో ప్యాక్రియాటైటిస్ అనే వ్యాధితో మరణించాడు. సంతోశ్ లాల్ అనారోగ్యంతో చివరి దశలో ఉన్నప్పుడు ధోని అతడికి ధోనీ అన్నిరకాలుగా అండగా ఉన్నాడు. మంచి వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్ లో రాంచీ నుంచి ఢిల్లీకి తరలించాడు. కానీ.. సంతోష్ లాల్ శరీరం వైద్యానికి సహకరించక చనిపోయాడు. ధోని హెలికాప్టర్ షాట్ ఆడటంసంతోష్ లాల్ దగ్గరే నేర్చుకున్నాడు. అతడి గుర్తుగా ధోని హెలికాప్టర్ షాట్ ని ఆడుతున్నాడనే విషయం చాలామందికి తెలియదు.


ధోనీ దారిలో మరికొంతమంది బ్యాటర్లు..
ధోని మాదిరిగానే టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా హెలికాప్టర్ షాట్లు కొట్టి ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు.. అఫ్గానిస్తాన్ క్రికెటర్ ముహ్మద్ షహజాద్ కూడా తన దైన స్టైల్‌లో హెలికాప్టర్ షాట్లు ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ మొదలెట్టిన హెలికాప్టర్ షాట్‌ను చాలా మంది క్రికెటర్లు అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags:, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,