ఒకేసారి ఒకే బోర్డు మీద హిందీ, ఉర్దూ పాఠాలు.. వీడియో వైరల్

ఎక్కడైనా తరగతి గదులు లేకపోతే చెట్ల కింద పాఠాలు చెప్పడం చూశాం. కానీ, ఇక్కడ మాత్రం తరగతి లేదని వేరే తరగతి గదిలో ఒకే బోర్డు మీద, ఒకేసారి రెండు సబ్జెక్టులు బోధించారు. ఈ వింత ఘటన బీహార్ లో వెలుగుచూసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బీహార్‌లోని కతిహార్‌లోని ఆదర్శ్ మిడిల్ స్కూల్‌లో ఇద్దరు ఉపాధ్యాయులు ఒకేసారి ఒకే బ్లాక్‌బోర్డ్‌పై హిందీ మరియు ఉర్దూ పాఠాలు చెబుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు బ్లాక్‌బోర్డ్‌కు ఇరువైపులా నిలబడి రెండు వేర్వేరు భాషలను బోధిస్తుండటం, విద్యార్థులు వినడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకేసారి రెండు సబ్జెక్టులు వినడం వల్ల ఏ సబ్జెక్టు తలకెక్కుతుందని పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు.

ఈ ఘటనపై పాఠశాల అసిస్టెంట్ టీచర్ కుమారి ప్రియాంక స్పందించారు. రాష్ట్ర విద్యా శాఖ 2017లో ఉర్దూ ప్రాథమిక పాఠశాలను మా పాఠశాలకు మార్చింది. తరగతి గదులు సరిపడా లేకపోవడంతో ఉపాధ్యాయులు హిందీ, ఉర్దూ రెండింటినీ ఒకే తరగతి గదిలో బోధిస్తారు. ఒకే బ్లాక్‌ బోర్డ్‌లో సగం వరకు హిందీ, మరో సగంలో మరొక ఉపాధ్యాయుడు ఉర్దూను బోధిస్తారు. పాఠశాలకు తగినంత తరగతి గదులు లేవు. ఒకే గదిలో విద్యార్థులకు రెండు పాఠాలు బోధించడానికి కారణం ఇదే’ అని ప్రియాంక తెలిపారు.

ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి కామేశ్వర్ గుప్తా మాట్లాడుతూ, ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు అదనంగా తరగతి గదులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఒక విద్యార్థి రెండు భాషలను కలిపి నేర్చుకోవడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం బీహార్‎లో బీజేపీ అలయన్స్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రం ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ.. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాన్నే పట్టించుకోవడం లేదు.. అటువంటిది మిగతా రాష్ట్రాలను ఎలా పట్టించుకుంటుందని ఎద్దేవా చేస్తున్నారు.