జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్లమెంట్, రాష్ట్రాలు అవసరమైతే వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చని పేర్కొంది. వస్తు సేవల పన్ను (GST)కి సంబంధించి సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించింది.
జీఎస్టీపై చట్టాన్ని రూపొందించేందుకు కేంద్ర, రాష్ట్రాలకు అధికారాలు ఉన్నాయని తీర్పు సందర్భంగా జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆచరణీయ పరిష్కారాన్ని సాధించడానికి జీఎస్టీ కౌన్సిల్ సామరస్యపూర్వకంగా పని చేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.
ఆర్టికల్ 246ఏ ప్రకారం పన్నులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసుకోవచ్చని ధర్మాసనం గుర్తు చేసింది. 2007 ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (IGST) చట్టం ప్రకారం సముద్ర రవాణాపై పన్ను విధించడానికి సంబంధించిన గుజరాత్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా చేసిన అప్పీల్పై సుప్రీం ఈ తీర్పు వెలువరించింది.