ఆంగ్ సాన్ సూకీ నాలుగేళ్ల జైలు. ఖండించిన ఆమ్నెస్టీ

మయన్మార్ మాజీ అధ్యక్షురాలు ఆంగ్ సాన్ సూకీ కి అక్కడి మిలటరీ నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరుగుబాటు చేసి మిలటరీ అధికారాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ఆంగ్ సాన్ సూకీతో పాటు మరికొందరిపైన అవినీతి, ఎన్నికల్లో మోసాలు వంటి అభియోగాలు మోపారు. దీనిపై సైన్యం ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఐతే సూకీ పై సైన్యాన్ని రెచ్చగొట్టడంతో పాటు కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ దోషిగా తేల్చారు. జుంటా మిలటరీ కోర్టు సూకీకి నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. మాజీ అధ్యక్షుడు విన్ మైంట్‌ పై సైతం ఇవే ఆరోపణలు చేసి ఆయనకు రెండేళ్లు జైలు శిక్ష విధించారు. వారిపై నమోదు చేసిన మరిన్ని అభియోగాల విచారణ జరుగుతోంది. వీటిలో దోషిగా తేలితే 10 ఏళ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉంది.

 

ఖండించిన ఆమ్నెస్టీ

ఐతే సుకీకి విధించిన శిక్షపై హక్కుల పరిరక్షణ సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించింది. తప్పుడు ఆరోపణలతో కావాలనే సూకీకి శిక్ష విధించారని సంస్థ క్యాంపెయిన్స్‌ డిప్యూటీ రీజినల్‌ డైరెక్టర్ మింగ్ యు హా అన్నారు. ఇది కచ్చితంగా ప్రతీకార చర్యేనని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ మయన్మార్ సీనియర్ సలహాదారు రిచర్డ్ హార్సే ఆరోపించారు.