తాజ్‌మహల్‌ మాదేనంటున్న బీజేపీ ఎంపీ

తాజ్‌మహల్‌ పవిత్రప్రేమ చిహ్నం అంటారు. ఆ సుందర కట్టడాన్ని చూడటానికి దేశవిదేశాలనుంచి ఎందరో పర్యాటకులు వస్తుంటారు. భారతదేశానికి మొదటిసారిగా వచ్చినవారు తప్పకుండా తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకుంటారు. అటువంటి గొప్ప చరిత్ర ఉన్న ఆ ప్రేమ మందిరం తమదేనని రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌ బీజేపీ ఎంపీ, రాజకుటుంబానికి చెందిన దియా కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్‌మహల్‌ను నిర్మించిన భూమి మొదట జైపూర్ రాజకుటుంబానికి చెందినదని, దానిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ స్వాధీనం చేసుకున్నారని ఆమె బుధవారం పేర్కొన్నారు. ఈ భూమి జైపూర్ కుటుంబానికి చెందినదని మరియు షాజహాన్ దానిని స్వాధీనం చేసుకున్నట్లు మా వద్ద పత్రాలు ఉన్నాయని దియా కుమారి వ్యాఖ్యానించారు.

తాజ్‌మహల్‌ చరిత్రపై నిజనిర్ధారణ విచారణ కోరుతూ అయోధ్య జిల్లా బీజేపీ మీడియా ఇన్‌చార్జి రజనీష్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను దియా కుమారి సమర్థించారు. తాజ్‌మహల్‌ లోపల 20 గదులలో హిందూ విగ్రహాలు ఉన్నాయని.. వాటిని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో (ASI)తనిఖీ చేయించాలని కోరుతూ రజనీష్ సింగ్ మే 4న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘తాజ్ మహల్‌లోని దాదాపు 20 గదులు లాక్ చేయబడ్డాయి. ఎవరినీ ఆ గదుల లోపలికి అనుమతించడం లేదు. ఈ గదుల్లో హిందూ దేవుళ్ల విగ్రహాలు, గ్రంధాలు ఉన్నాయని మా నమ్మకం’ అని రజనీష్ సింగ్ తన పిటిషన్‎లో తెలిపారు.

‘ తాజ్‌మహల్‌ ఉన్న భూమి మాది అని నేను అనడం లేదు. అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. అయితే మా వద్ద అందుబాటులో ఉన్న ఏవైనా పత్రాలను అందించమని కోర్టు మమ్మల్ని కోరితే, మేము పోతిఖానా (ప్యాలెస్‌లోని రికార్డ్ రూమ్) నుంచి అందజేస్తాం. అక్కడ గదులు ఎందుకు తాళం వేశారో ప్రజలకు తెలియాలి. అక్కడ చాలా గదులు సీలు చేయబడ్డాయి మరియు తలుపుల వెనుక ఏం ఉందో పరిశీలించాలి’ అని దియా కుమారి కోరింది. కాగా కేసు కోర్టులో ఉందని, ఆ భూమి పూర్వపు జైపూర్ రాజకుటుంబానికి చెందినదని కూడా దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నట్లు కుమారి తెలిపారు. గదులు తెరిచి విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.