హుజురాబాద్ ఎన్నికల్లో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు వీణవంకలోని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఇంట్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు సీఎంగా కేసీఆర్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమనే విషయం అర్థమైంది. ఎమ్మెల్యేగా కూడా తెరాస అభ్యర్థులనే ఎన్నుకుంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాల వల్ల ప్రజలు టీఆర్ఎస్ ను, కారు గుర్తుకే ఓటేస్తున్నరు. ఈసారి హుజురాబాద్ లో కూడా రిపీట్ అయ్యేది ఇదే. రైతులకు రైతుబీమా ఇస్తున్నాం. ధాన్యం ప్రభుత్వమే కొంటుంది. ఉద్యోగాలిచ్చాం. రిజర్వేషన్లు కల్పించాం, రైతుబంధు, దళితబంధు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా, కంటివెలుగు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందని మంత్రి తలసాని అన్నారు.

ఈటల గెలిస్తే ఆయనకే ఉపయోగం.. గెల్లు శ్రీనివాస్ గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు ఉపయోగం. ప్రజలంతా పేదింటి బిడ్డను గెలిపిస్తాం. విద్యార్థి ఉద్యమ నాయకుడిని గెలిపిస్తామంటున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ.. ప్రజలను మోసం చేసే బీజేపీ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారు అన్నారు మంత్రి తలసాని. 74 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఎవరూ ఇన్ని కార్యక్రమాలు చేయలేదు. అనేక రంగాల్లో లక్షలాది మందికి ఉపాధి వచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కులవృత్తులను ప్రోత్సహిస్తున్నాం. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు తెచ్చాం. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు.. చేసేది ఉంటే చెప్పాలి. లేనిపోని అబద్ధాలు, అవాస్తవాలు చెప్తే నమ్మే స్థితిలో ప్రజలు లేరు. బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో సోయి కూడా లేదని ఎద్దేవా చేశారు తలసాని.
హుజురాబాద్ లో అసలు కాంగ్రెస్ కు దిక్కు లేదు. బీజేపీ ఇక్కడ ఉందా..? కమ్యూనిస్టు సిద్దాంతాలు చెప్పే ఈటెల రాజేందర్ మతతత్వ పార్టీలో చేరారు. ప్రజలకు ఏం సమాధానం చెప్తవ్ ఈటలా? అని మంత్రి తలసాని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది? ఒక ప్రాజెక్టైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాలనలో రావనుకున్న నీళ్లు, కరెంటు వచ్చింది.. ఒకప్పుడు కరెంటు లేక రాత్రి పూట బావి దగ్గరే పడుకునేవాళ్ళమని రైతులే చెప్తున్నారు. చెబుతున్నారు. ఇప్పుడు రోజంతా కరెంటు.. పొలం నిండా నీళ్లు ఉంటున్నాయి. సబ్బండ వర్గాలు సంతోషంగా ఉండాలనేదే మా ఆకాంక్ష. పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టిన దళిత బంధును ఆపారు. దళితబంధును ఆపిన సంతోషం బీజేపీ నేతలకు కొన్నిరోజులు మాత్రమే. నవంబర్ 4వ తర్వాత మళ్లీ కొనసాగుతుంది. ఈటెల రాజేందర్ పెద్ధోడు.. గెల్లు శ్రీనివాస్ చిన్నవాడు అంటున్నారు. నాగార్జున సాగర్ లో నోముల భగత్.. జానారెడ్డి మీద గెలిచాడు.. సేవకు వయసు పరిమితం కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రజలకు శ్రీరామ రక్ష అన్నారు మంత్రి తలసాని.