రిటైర్మెంట్ ప్రకటించిన మరో టీమిండియా ఆల్ రౌండర్

టీమిండియా సీనియర్ క్రికెటర్, భారత మహిళల క్రికెట్ లో సుదీర్ఘకాలం పాటు సేవలందించిన వెటరన్ ఆల్ రౌండర్ రుమేలీ ధార్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకింది. 2003-18 వరకు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రుమేలీ.. ఆల్ రౌండర్ గా సేవలందించింది. ఇటీవలే సుదీర్ఘకాలంపాటు టీమిండియాకు సేవలందించిన మిథాలిరాజ్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

దేశవాళీలో తనకు అవకాశం కల్పించిన బెంగాల్, రైల్వేస్, ఎయిరిండియా, ఢిల్లీ, రాజస్తాన్, అసోంలకు రుమేలీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది. భారత జట్టులోకి రావడానికి, ఇక్కడ నిరూపించుకోవడానికి దేశవాళీ జట్లు ఎంతో ఉపకరించాయని పేర్కొంది.

2003లో ఇంగ్లాండ్ పర్యటన ద్వారా భారత జట్టులోకి అడుగిడిన రుమేలీ.. చివరిసారి 2018లో ఇండియా-ఇంగ్లండ్-ఆస్ట్రేలియా ఆడిన ట్రై సిరీస్ లో పాల్గొంది. తన సుదీర్ఘ కెరీర్ లో ఆమె భారత జట్టు తరఫున 4 టెస్టులు, 78 వన్డేలు, 18 టీ20లలో ఆడింది. టెస్టులలో 236 పరుగులు, 8 వికెట్లు.. వన్డేలలో 961 పరుగులు, 63 వికెట్లు.. టీ20లలో 131 పరుగులు, 13 వికెట్లు పడగొట్టింది.