సౌతాఫ్రికా సిరీస్ పాయే.. ర్యాంకింగ్ పాయే.. ఇలా అయితే కష్టమే..!

Team-India

సౌతాఫ్రికా గడ్డపై 30 ఏళ్లుగా గెలవని సిరీస్ ఈ సారైనా నెగ్గి.. చరిత్ర సృష్టించాలనుకున్న భారత జట్టుకి మరోసారి నిరాశే ఎదురైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో స్వీయ తప్పిదాలు చేసి భారీ మూల్యం చెల్లించుకుంది. పదే పదే ఆఫ్ సైడ్ బంతుల్ని వెంటాడీ బ్యాటర్లు తీవ్రంగా నిరాశపర్చగా.. ఫీల్డింగ్ లోనూ తేలిపోయారు. బౌలర్లు మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు.

సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 113 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. గత వారం జొహన్నెస్‌బర్గ్ లో ముగిసిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈరోజు కేప్‌టౌన్ టెస్టులో 7 వికెట్ల తేడాతో ఓడటం ద్వారా సిరీస్‌ని చేజార్చుకుంది.

దీంతో మూడు టెస్ట్ ల సిరీస్‌ను 2-1 తేడాతో చేజార్చుకున్న టీమిండియా.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్లోనూ ఒక స్థానాన్ని కొల్పోయింది.  ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలోనూ నాలుగో స్థానం నుంచి ఐదో స్థానానికి భారత్ పడిపోగా.. సౌతాఫ్రికా ఐదు నుంచి నాలుగుకి ఎగబాకింది.

2021, జులై తర్వాత ఇప్పటి వరకూ 9 మ్యాచ్‌లను(మూడు టెస్టు సిరీస్‌లు) ఆడింది. నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి.. మూడింట్లో ఓడి.. రెండింటిని డ్రాగా ముగించింది. మొత్తం 53 పాయింట్లని సాధించిన భారత్ 49.07 విజయాల శాతంతో ఐదో స్థానంలో కొనసాగుతుంది.

గత డబ్ల్యూటీసీలో ఫైనల్ కి చేరిన టీమిండియా.. ఈ సారి అక్కడవరకు వెళ్లడం కష్టంగానే కన్పిస్తోంది. మన పాయింట్ల శాతం 50 కన్నా తక్కువగా ఉండటం కూడా మనకు మైనస్ గా మారే ఛాన్సు ఉందని స్పోర్ట్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.