నేడు ఢిల్లీ వెళ్లనున్న రాష్ట్ర మంత్రులు.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో చర్చలు

ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణ అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత కోరేందుకు రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం ఈరోజు ఢిల్లీ వెళ్తున్నది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధ్వర్యంలో మంత్రులు మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌లతో కూడిన బృందం కేంద్ర ప్రభుత్వంతో జరిగే చర్చల్లో పాల్గొననున్నది. ఈరోజు సాయంత్రం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశం కానున్నది.


ఈ నెల 23న మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌తో జరిపిన చర్చలు పూర్తికాలేదు. ఆరోజు జరిగిన భేటీలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పూర్తి కేంద్ర మంత్రులు స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల 26న మరోసారి సమావేశమవుదామని కేంద్ర మంత్రులు ప్రతిపాదించారు. కేంద్రం ఇచ్చే స్పష్టతకు అనుగుణంగా యాసంగిలో అనుసరించాల్సిన విధానంపై రైతులకు మార్గ నిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.