ఉద్యోగాల కల్పన పైన ప్రత్యేక దృష్టి.. కేటీఆర్

హైదరాబాద్ జలమండలిలో మేనేజర్లుగా ఉద్యోగం సాధించిన 93 మందికి ఇవాళ మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కే. తారక రామారావు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ఉద్యోగాల కల్పన పైన ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటిదాకా సుమారు లక్ష 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని చెప్పారు.

ప్రైవేట్ రంగంలో అనేక పెట్టుబడులను ఆకర్షించి… సుమారు 15 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను సృష్టించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఒక ప్రత్యేకత ఉందని.. ఈ ఉద్యోగాన్ని ప్రజల సేవల కోసం ఉపయోగించండని కేటీఆర్ సూచించారు. ప్రజలకు సేవ అందించడమే పరమావధిగా పని చేయాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సేవా దృక్పధాన్ని విడనాడకుండా పని చేయాలని సూచించారు.

తెలంగాణ ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నందన్నారు. ఏలాగైతే ఒక్క రూపాయి ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించగలిగారో… అదేవిధంగా ఒక రూపాయి తీసుకోకుండా అత్యంత నిజాయితీతో ప్రజా సేవకి పాటుపడాలని కేటీఆర్ అన్నారు. ఈ ఉద్యోగాన్ని ఒక సవాలుగా తీసుకొని… జల మండలిని మరింత అభివృద్ధి పథాన నిలిపే విధంగా వినూత్న ఆలోచనలతో పనిచేయాలని కేటీఆర్ సూచించారు.