జర్మనీకి తొలి మహిళా ఛాన్స్ లర్గా ఎన్నికై రికార్డు సృష్టించిన ఏంజెలా మెర్కెల్(67).. సుదీర్ఘ కాలంపాటు ఆ పదవిలో కొనసాగిన మహిళగా మరో ఘనత సాధించారు. ఇలా 16ఏళ్ల పాటు ఏకధాటిగా జర్మనీ ఛాన్సలర్ పదవిలో కొనసాగిన ఆమె ప్రస్థానం డిసెంబర్ 8తో ముగియనుంది. తదుపరి ఛాన్సలర్‌గా ఓలఫ్ స్కాల్జ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
జర్మనీ చరిత్రలో సుదీర్ఘకాలం పాటు ఈ పదవిని చేపట్టిన బిస్మార్క్ (దాదాపు 23ఏళ్లు).. ఏంజెలా గురువుగా భావించే హెల్మట్ కోల్ (16ఏళ్ల 26రోజులు) అధికారంలో కొనసాగారు. వీరిద్దరి తర్వాత అత్యధిక కాలం ఛాన్సలర్ పదవి చేపట్టిన మూడో నేతగా ఏంజెలా మెర్కెల్ తాజాగా రికార్డు సృష్టించారు.
16 ఏండ్ల తన ప్రస్థానంలో ఏంజెలా మెర్కెల్.. అమెరికాకు చెందిన నలుగురు అధ్యక్షులు, ఫ్రాన్స్ కు చెందిన నలుగురు అధ్యక్షులు, బ్రిటన్‌కు చెందిన ఐదుగురు ప్రధాన మంత్రులు, ఇటలీకి చెందిన ఎనిమిది మంది ప్రీమియర్లు మారారు. అయితే వారిలో కొందరు రెండు సార్లు ఎన్నికైన వారున్నారు.
తూర్పు జర్మనీకి చెందిన ఏంజెలా మెర్కెల్ మొదట్లో ఓ సైంటిస్ట్. అనంతరం క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. నవంబర్ 22, 2005లో జర్మనీ ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించే ప్రపంచ శక్తిమంతమైన మహిళల జాబితాలో వరుసగా గత పదేళ్లుగా ఆమె నిలుస్తున్నారు.