బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికుల పథకాలు ఊడగొట్టి.. నోటి కాడి బుక్క ఎత్తగొట్టారు

కరీంనగర్ జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో చేనేత కార్మికులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎల్. రమణ, పెద్దిరెడ్డి, కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. దాదాపు 2 వేల మంది లబ్ధిదారులకు రూ. కోటి 69 లక్షల విలువైన 1,803 చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాక మునుపు రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉండేవి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేనేత కార్మికులకు భరోసా దొరికింది. చేనేత కార్మికులకు రూ. 100 కోట్లతో రుణ విముక్తులను చేశాం. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తున్నాం. ముడి సరుకుకు సబ్సిడీ అందజెస్తున్నాం. త్రిఫ్ట్ ఫండ్ కూడా ఇస్తున్నాం. త్రిఫ్ట్ పథకానికి మంత్రి కేటీఆర్ రూ. 30 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు.

చేనేత కార్మికులు రూ. 800, రూ. 1200 కట్టినా రెండింతలు ప్రభుత్వం జమ చేస్తది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 8 పథకాలు వచ్చాయి. ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు ఏం ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికుల పథకాలు ఊడగొట్టి.. నోటి కాడి బుక్క ఎత్తగొట్టారు. ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డును కేంద్రం రద్దు చేసింది. బోర్డును బలోపేతం చేయాల్సిన బీజేపీ చేనేత కార్మికుల ఉసురు పోసుకుందన్నారు.

బీజేపీ 4 శాతం త్రిఫ్ట్ ను రద్దు చేస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం 16 శాతం త్రిఫ్ట్ ఫండ్ ఇస్తోంది. చేనేత కార్మికుల్లో ఆధరణ పొందిన ఆరోగ్య భీమా పథకాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. మిమ్మల్ని కాపాడుకున్నోళ్లు ఎవరు.. ముంచింది ఎవరు గుర్తు పెట్టుకోవాలి. న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడండి. వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా.. నేతన్నల ప్రయోజనం ముఖ్యమా ఆలోచించండి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేతన్నలకు అన్యాయం చేసిందన్నారు.

అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 4 వేల ఇండ్లు ఇస్తే ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. మీరు ఆశీర్వదం ఇస్తే మీ సొంత జాగలో ఇల్లు ఇస్తాం. స్థలం లేకుంటే ఇల్లు కూడా కట్టి ఇస్తాం. హుజురాబాద్ లో పద్మశాలి భవన్ కోసం ఎకరా స్థలం, రూ. కోటి ఇచ్చాము. రాబోయే కొద్దీ రోజుల్లో జమ్మికుంటలో కూడా ఎకరా స్థలం కేటాయిస్తాం. మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అన్నారు.

బీజేపీ వాళ్లవి రద్దు.. మేము చేసేది మంజూరు. రద్దులు చేసే వాళ్లను మనము కూడా రద్దు చేయాలి. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి.. చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తాం. పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. సీఎం కేసీఆర్ హైదరాబాద్ కోకాపేటలో పద్మశాలీ భవన్ కోసం రూ. వంద కోట్ల విలువైన భూమిని, రూ. 5 కోట్లు కేటాయించారన్నారు.

ఎల్. రమణ మాట్లాడుతూ.. కరోనా మూలంగా చేనేత పరిశ్రమ దెబ్బతిన్నది. చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారన్నారు.