హుజూరాబాద్‌ ఉపఎన్నిక: ఉదయం 9.30కే తొలి రౌండ్‌ ఫలితం

The result of Huzurabad by-election will be known in a few hours

The result of Huzurabad by-election will be known in a few hours

రాష్ట్ర స్థాయిలో ఉత్కంఠను రేపుతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది. కాసేపట్లో కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలుత ఉదయం 8 గంటలకు 753 పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కపెట్టడం ప్రారంభిస్తారు.

కొవిడ్‌ నిబంధనల ప్రకారం రెండు కేంద్రాలను లెక్కింపు కోసం ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో 7 టేబుళ్ల చొప్పున ఏకకాలంలో రెండు చోట్ల 14 టేబుళ్లపై ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. ఇలా ఒక్కో రౌండ్‌లో 14 టేబుళ్లపై రెండు ఈవీఎంలలో ఆయా అభ్యర్థులకు పడిన ఓట్లను ఏజెంట్ల సమక్షంలో లెక్కిస్తారు. మొత్తంగా 22 రౌండ్ల లెక్కింపు జరగనుంది. తొలుత హుజూరాబాద్‌ మండలంలోని 14 గ్రామాలు, అనంతరం వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్‌ మండలాల ఓట్లను లెక్కింపు చేపడతారు. తొలిరౌండు ఫలితాలు ఉదయం 9:30 గంటలకు వచ్చే అవకాశం ఉంది. 30 మంది అభ్యర్థులు ఉండటంతో తుది ఫలితం వచ్చే సరికి సాయంత్రం అవనుంది. పోలింగ్ నేపథ్యంలో గట్టి పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.