రేపు హుజురాబాద్ లో రెండో విడత గొర్రెల పంపిణీ - TNews Telugu

రేపు హుజురాబాద్ లో రెండో విడత గొర్రెల పంపిణీ



తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ లో రేపు రెండో విడత గొర్రెల పంపిణీ చేయనున్నారు. పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మార్కెట్ యార్డ్ లో ఉదయం 11 గంటలకు అర్హులందరికీ గొర్రెలు అందజేస్తారు. మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు లు ఇందులో పాల్గొంటారు. 2 వ విడతలో రాష్ట్రంలోని 3. 81 లక్షల మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే సీఎం కేసీఆర్ 6 వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అంతేకాకుండా పెరిగిన ధరలు, లబ్దిదారుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గొర్రెల యూనిట్ ధర గతంలో 1.25 లక్షల రూపాయలు ఉండగా.. దానిని 1.75 లక్షల రూపాయలకు పెంచేందుకు కూడా సీఎం అంగీకరించారు. రాష్ట్రంలోని 8109 సొసైటీ లలో సభ్యులుగా ఉన్న 7,61, 898 మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్ లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడత లో 5 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. అందులో 4702.78 కోట్ల రూపాయల ఖర్చుతో 3,76, 223 యూనిట్ల గొర్రెలను లబ్దిదారులకు ప్రభుత్వం పంపిణీ చేసింది.