‘అల్ల నేరేడు’తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఈ సీజన్ లో దొరికే అల్ల నేరేడు పండ్లు, ఆకులు, బెరడు ఔషధాల సమాహారం. ఎన్నో వ్యాధులను నయం చేసే ఈ పండ్లు చూసేందుకు నల్లగా నిగనిగలాడుతాయి. తింటే ఒగరు, తీపి, పుల్లగా ఉంటాయి.

చక్కెర వ్యాధి, గుండె సబంధ జబ్బులు, కాలానుగుణంగా వచ్చే వ్యాధులను అరికట్టడంలో ఎంతో చక్కగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీటిలో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్‌, మాంగనీస్‌, జింకు, ఐరన్‌, విటమిన్‌ సి, రెబోప్లోబిన్, నికోటిన్‌, ఆమ్లం,కోలైన్‌, పోలిక్‌ యాసిడ్‌ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయన్నారు. వ్యాధి నిరోధకతను పెంచడంలో ఈ పోషకాలు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు.

కొన్ని ఆరోగ్య చిట్కాలు

  • నేరేడు పండ్లలోని యాంటీ అక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగు పర్చడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి.
  •  మహిళలకు రుతుస్రావం అధికంగా అయితే నేరేడు గింజల పొడిని కషాయంగా చేసుకొని చెంచాడు తాగితే మంచి ఫలితం ఇస్తుంది.
  • జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలుపుకొని తాగితే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
  • మూత్రంలో మంట తగ్గడానికి నిమ్మ, నేరేడు రసం రెండు చెంచాలు నీళ్లలో కలుపుకొని తీసుకోవాలి.

  • జీర్ణశక్తిని పెంచడంతో పాటు గ్యాస్‌ లాంటి సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతుంది.
  • జిగట విరేచనాలతో బాధ పడేవారు రెండు, మూడు చెంచాల నేరేడు పండ్ల రసాన్ని తాగితే విరేచనాలు తగ్గుతాయి.
  • నేరేడు పండు గింజలను ఎండబెట్టుకొని పొడి చేసి రోజూ గ్లాసు నీటిలో కలుపుకొని తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. వాపు కూడా తగ్గిస్తుంది. కొలస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచడంతోపాటు మెదడుకు మంచి ఔషధంగా పని చేస్తాయి.