కూలీలపైకి దూసుకెళ్లిన లారీ. ముగ్గురు మృతి, 11మందికి తీవ్ర గాయాలు

హరియాణాలోని ఝాజ్జర్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకొంది. కుండలీ-మనేసర్‌- పాల్వాల్‌ హైవే ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి ఓ లారీ దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందగా.. 11 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన గురువారం తెల్లవారు జామున జరిగింది.

అశోద టోల్‌ ప్లాజా సమీపంలో జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 18 మంది కూలీలు పని చేస్తున్నారు. వారిలో 14 మంది పని తర్వాత ఫుట్‌పాత్‌పై నిద్రించారు. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ లారీ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లింది. అనంతరం అదుపుతప్పి బోల్తా పడింది. అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడు.

సమచారాం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిని పీజీఐఎమ్‌ఎస్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి అమిత్‌ యశ్‌వర్థన్‌ వెల్లడించారు.