రాష్ట్రంలో నేటి నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీ కర్యాక్రమాన్ని నేటి (బుధవారం) నుంచి రాష్ట్ర పశు సంవర్ధకశాఖ ప్రారంభించనుంది.. గొర్రెల పంపిణీ కార్యక్రమానికి కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని వేదికగా ఎంచుకున్నారు. పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌  రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో 5 వేల మంది గొల్ల కురుమల లబ్ధిదారులతో భారీ సభ ఏర్పాటు చేసి గొర్రెల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3.81 లక్షల మంది గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేయనున్నారు. ప్రతి ఒక్కరికి ఒక యూనిట్‌ (21) గొర్రెలను పంపిణీ చేస్తారు. ఇంతకు ముందు ధర కన్నా ప్రస్తుత గొర్రెల యూనిట్‌ ధరను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచారు. మొదటి విడత పంపిణీలో రూ.4702 కోట్లతో 3.76 లక్షల మందికి గొర్రెల పంపిణీ జరిగింది. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాష్ట్రమంతటా గొర్రెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది.