‘లైగ‌ర్’ ప్ర‌మోష‌న్‌లో తొక్కిస‌లాట.. వీడియో

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న ‘లైగ‌ర్’ సినిమాకు పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్ ఇండియా మొత్తం ఊపేసింది. ఆరున్న‌ర కోట్ల వ్యూస్‌తో గ‌త ప‌ద‌కొండు రోజులుగా యూట్యూబ్ ట్రెండిగ్‌లో నిలిచింది.

ఇప్పటికే విడుదలైన లైగ‌ర్ పోస్ట‌ర్లు, ట్రైల‌ర్‌ల‌తో హిందీలో విప‌రీత‌మైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఆగ‌స్టు 25న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో ఆదివారం ముంబైలోని నావి హోట‌ల్‌లో భారీ ఎత్తున మేక‌ర్స్‌ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఇక ఈ కార్య‌క్ర‌మానికి ప్రేక్ష‌కులు భారీ సంఖ్య‌లో వ‌చ్చారు.

ఈవెంట్‌లో విజ‌య్ మాట్లాడుతుండ‌గానే అభిమానులు ఒక్క సారిగా ప్రేక్ష‌కులు స్టేజ్ పైకి ఎగ‌బ‌డ్డారు. దాంతో అక్క‌డ‌ తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ తొక్కిస‌లాట‌లో ప‌లువురు కింద ప‌డ్డారు. వారిని బౌన్స‌ర్లు, ఇత‌ర సెక్యూరిటీ బ‌య‌ట‌కు తీశారు. నిర్వాహ‌కులు క్రౌడ్‌ను కంట్రోల్ చేయ‌లేక ఈ కార్య‌క్ర‌మాన్ని అర్థాంత‌రంగా ఆపేశారు.

లైగ‌ర్ చిత్రాన్ని క‌ర‌ణ్‌జోహ‌ర్‌, ఛార్మీతో క‌లిసి పూరి స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించాడు. ముంబైలోని ఓ చాయ్‌ వాలా ప్ర‌పంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. విజ‌య్‌కు జోడీగా అన‌న్య‌పాండే హీరోయిన్‌గా న‌టించింది. ప్ర‌ముఖ బాక్స‌ర్ మైక్ టైస‌న్ కీల‌కపాత్ర‌లో న‌టించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుంది.