బీజేపీ నేతల కళ్లబొల్లి మాటలు నమ్మొద్దు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట రూరల్ మడిపల్లిలో గాయకుడు సాయి చంద్ బృందంచే తెలంగాణ ధూం ధామ్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి  హాజరైన జమ్మికుంట రూరల్ ఇంచార్జి, వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పెంచి పోషించిన వ్యక్తి.. పార్టీని విచ్చిన్నం చేసే కుట్ర చేసిండు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీ గడపలో.. మీ గుండెలో నిలిచిపోయే పథకాలు కొనసాగుతున్నాయన్నారు.

అనేక సంవత్సరాలు అంటరాని వారిగా ఉన్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపే దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. రూపాయి సాయం చేయని బీజేపీకి ఓటేద్దామా ఆలోచించాలి. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన బీజేపీకి ఓటేద్దామా ఆలోచన చేయాలి. పని చేసే పార్టీని ఆశీర్వదించండి.. సీఎం కేసీఆర్ బలపర్చిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

మోడీ 2 సార్లు ప్రధాని అయినా.. 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇయ్యలే

టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 2001లో టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నప్పటి నుంచి పోరాడిన. సీఎం కేసీఆర్ ఏ ఉద్యమం తీసుకున్నా కొట్లాడిన మీ బిడ్డను. ఆనాటి నుంచి ఈనాటి వరకు సీఎం కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించిన నిర్వర్తించాను. ఒక్క అవకాశం ఇవ్వండి.. మీకు సేవ చేస్తానన్నాడు.

మనుషులు వస్తుంటారు.. పోతుంటారు.. పార్టీయే ముఖ్యం. డబ్బులు ఉన్న వాళ్లు ప్రలోభాలు పెడతారు.. మీరంతా ఆలోచించాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో బృహత్తర కార్యక్రమాలు అమలవుతున్నాయి. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎండాకాలం కూడా నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయన్నారు.

తెలంగాణ వచ్చాక లక్షా 30 వేల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోడీ 2 సార్లు ప్రధాని అయినా 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. బీజేపీ నేతల కళ్లబొల్లి మాటలు నమ్మొద్దు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి.. మీ ఇంట్లో బిడ్డలా పని చేస్తానన్నాడు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నారు.

రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నడు

రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. మామూలు వ్యాపారవేత్తగా ఉన్న ఈటెలను ఎమ్మెల్యేను, మంత్రిని చేసింది సీఎం కేసీఆర్. మమ్మల్ని బాగు చేయి అని హుజురాబాద్ ప్రజలు గెలిపిస్తే హైదరాబాద్ లో వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకున్నాడు. అధికారాన్ని దుర్వినియోగం చేసి పేదల భూములను దోచుకున్నాడు. 20 ఏళ్ళు పదవులు అనుభవించి  ఇవాళ దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల నడ్డి విరిచేలా ధరలు పెంచుతుందన్నాడు.

ఈటలను గెలిపిస్తే అక్రమంగా మరో 200 ఎకరాలు సంపాదిస్తాడు. హుజురాబాద్ లో ద్రోహికి.. ఉద్యమకారుడికి మధ్య పోటీ జరుగుతుంది. దొంగలకు అడ్డాగా ఉంది కాబట్టే ఈటెల బీజేపీలోకి వెళ్ళాడు. ఈటెల మాటలకు ప్రజలే ఓటుతో బుద్ది చెప్తారు. రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణకు కేవలం 10 వేల ఉద్యోగాలు ఇచ్చింది. కన్నతల్లి లాంటి పార్టీకి ఈటెల ద్రోహం చేశాడు. పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరాడు.