మధ్యాహ్నం 2 వరకు లోక్‌సభ వాయిదా.. రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీ ల వాకౌట్

TRS MPs raise concerns in both the Houses of Parliament

పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళ‌న‌కు దిగారు. వ‌రి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న‌గా స్పీక‌ర్ పోడియంలోకి దూసుకెళ్లారు. ధాన్యం సేక‌రించాలంటూ నామా నాగేశ్వ‌ర రావు నేతృత్వంలోని ఎంపీలు.. ఆకుప‌చ్చ కండువాలు ధ‌రించి.. వ‌రిధాన్యం సేక‌ర‌ణ‌పై జాతీయ విధానం ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో వెల్‌లోకి దూసుకువెళ్లిన టీఆర్ఎస్ స‌భ్యులు నినాదాల‌తో హోరెత్తించారు. . తెలంగాణ బ‌చావో అంటూ స్పీక‌ర్ పోడియం ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను చ‌ట్ట‌బ‌ద్దం చేయాల‌ని డిమాండ్ చేశారు. వ‌రిధాన్యం కొనుగోళ్ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. దీంతో స్పీక‌ర్ ఓం బిర్లా స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.

రాజ్య‌స‌భ‌లో 12 మంది ఎంపీల స‌స్పెన్ష‌న్‌ను నిర‌సిస్తూ విప‌క్ష ఎంపీలు ఆందోళ‌న‌కు దిగారు. ఆ ఎంపీల‌పై విధించిన స‌స్పెన్ష‌న్ ఎత్తివేయాల‌ని కోరుతున్నామ‌ని మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే డిమాండ్ చేశారు. వ‌ర్షాకాల స‌మావేశాల్లో జ‌రిగిన ఘ‌ట‌న‌పై ఇప్పుడు ఎందుకు చ‌ర్య‌లు తీసుకున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీనిపై చైర్మ‌న్ వెంక‌య్య స్పందిస్తూ.. వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఎదురైన చేదు అనుభ‌వాలు ఇంకా వెంటాడుతున్నాయ‌న్నారు. ర‌భస సృష్టించిన ఎంపీల‌పై చ‌ర్య‌లు తీసుకునే హ‌క్కు చైర్మ‌న్‌కు ఉంద‌ని వెంక‌య్య‌నాయుడు తెలిపారు. స‌స్పెన్ష‌న్ ఎత్తివేత అభ్య‌ర్ధ‌న‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. స‌స్పెన్ష‌న్ ఎత్తివేత‌ను తిర‌స్క‌రించ‌డంతో.. విప‌క్ష స‌భ్యులు రాజ్య‌స‌భ నుంచి వాకౌట్ చేశారు.