హైదరాబాద్‌ వేదికగా నేడు TRS పార్టీ ప్లీనరీ మీటింగ్

TRS party plenary meeting today in Hyderabad

TRS party plenary meeting today in Hyderabad

స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా.. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి… గత ఏడున్నరేళ్లుగా నిరాటంకంగా సుపరిపాలన కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ దిగ్విజయంగా ఇరవై ఏండ్లు పూర్తి చేసుకున్నది. రెండు దశాబ్దాల కాలంలో అనేక అద్భుత ఘట్టాలకు సాక్షాత్కారమైన టీఆర్‌ఎస్‌ పార్టీ గతేడాది ప్లీనరీ నిర్వహించలేక పోయింది. కరోనా మహమ్మారి విజృంభణ మూలంగా పార్టీ కార్యక్రమాలను అట్టహాసంగా చేపట్టలేదు. కమిటీల కూర్పు సైతం వాయిదా పడగా తాజాగా సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో సంస్థాగత నిర్మాణం పూర్తయ్యింది.

కాగా నేడు హైదరాబాద్ హైటెక్స్ వేదికగా ప్లీనరీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి భారీ ఏర్పాట్లు చేశారు . సుమారు 6వేల మంది ప్రతినిధులు హాజరుకానుండగా…. వారికి ప్రత్యేక పాస్‌లు జారీచేశారు. మహిళా ప్రతినిధులు గులాబీ చీర, పురుషులు గులాబీచొక్కాతో హాజరుకావాలని పార్టీ అధినాయకత్వం నిర్దేశించింది. సుమారు 300 అడుగుల వేదికను ఏర్పాటుచేశారు. ప్లీనరీ వేదికపై తీగలవంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రతి ఊరు, వాడల్లో తెలంగాణ రాష్ట్ర సమితి జెండా ఎగురవేసే విధంగా పటిష్టవంతమైన కార్యాచరణతో గులాబీ దళపతి కార్యవర్గాలను కూర్పు చేశారు.

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సారథ్యంలో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీల ఏర్పాటుతో పాటు అనుబంధ సంఘాలను నియమించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో పదవులు దక్కించుకున్న వారంతా కొంగొత్త హుషారుతో ఉన్నారు. నూతనంగా పదవులు చేపట్టిన కీలకమైన నాయకులతో ద్విదశాబ్ది వేళ టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ హైటెక్స్‌ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల నుంచి ప్రజా ప్రతినిధులతో పాటు ముఖ్యమైన నాయకులంతా తరలి వెళ్లనున్నారు.