‘అగ్నిపథ్’ను రద్దుచేసే వరకు పోరాడుతం

భారత రక్షణ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్న అగ్నిపథ్ కాంట్రాక్ట్ విధానానికి వ్యతిరేకంగా టీఎస్ జేఏసీ, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఓయూ జెఏసీ చైర్మెన్ మాందాల భాస్కర్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మెన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు.

అగ్నిపథ్ స్కీం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వ్యతిరేక పథకం రిజర్వేషన్లు లేకుండా నాలుగుసంవత్సరాల కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించి యువకుల జీవితాలను నాశనం చేసే పథకం అని డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు.

అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేయాలని, దేశంలోని రైతులు, ఆర్మీ జవాన్లను బీజేపీ ప్రభుత్వం హింసిస్తుందని కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సెర్చి కమిటీ కన్వీనర్ ఇందిరా శోభన్ మాట్లాడుతూ.. అగ్నిపథ్ పథకం రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ఆరెస్సెస్ తీసుకొచ్చిన పథకంగా భావిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం హిందూ ముస్లిం, ఎస్టీ, ఎస్టీలను విభజిస్తూ కాలం గడుపుతుందన్నారు.

రౌండ్ టేబుల్ సమావేశ తీర్మానాలు

  1. అగ్నిపథ్ స్కీమ్ ను వెంటనే రద్దు చేయాలి
  2. సికింద్రాబాద్ అల్లర్లలో పేద విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి
  3. పోలీసు కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
  4. సికింద్రాబాద్ అల్లర్లలో గాయపడిన ప్రతి విద్యార్థికి ముప్పై లక్షల రూపాయల వైద్య సహాయం అందించాలి.
  5. రాష్ట్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి.
  6. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తమ కార్యాచరణ ప్రకటించాలని ఓయూ జేఏసీ కోరింది.
  7. దేశంలోని అన్ని వర్శిటీల విద్యార్థులతో త్వరలో ఢిల్లీ కేంద్రంగా భారీ ప్రదర్శన.