మేనల్లుడి పెండ్లికి మేనమామల గిఫ్ట్.. లెక్క పెట్టేందుకే మూడు గంటలు పట్టింది

తోడబుట్టిన వారి పిల్లల పెండ్లి అంటే మేనమామల హడావుడి మామూలుగా ఉండదు. ప్రతి తతంగం వారి చేతుల మీదుగానే జరుగుతుంది. రాజస్థాన్ లో ఓ గ్రామంలో చెల్లెలి కొడుకు పెండ్లికి మేనమాలు ఎన్నడూ మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. మేనమామలు పెండ్లికి ఇచ్చిన నగదు బహుమతిని లెక్క పెట్టేందుకు ఏకంగా మూడున్నర గంటలు పట్టిందట. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లా దేశ్వాల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. నాగౌర్ లో ఉండే ముగ్గురు సోదరులు తమ మేనల్లుడి పెండ్లికి రెండు బస్తాల నోట్లు కానుకగా ఇచ్చారు. చెల్లెలి కొడుకు పెండ్లి కోసం రెండున్నరేండ్లు కూడబెట్టి రెండు బస్తాలు నింపారు ముగ్గురు అన్నదమ్ములు.


పెండ్లిలో రెండు బస్తాల నిండా తెచ్చిన నోట్లు మేనల్లుడికి అందించారు. మొత్తం నగదు రూ.10 నోట్లే కావడం విశేషం. మేనల్లుడి పెండ్లికి నగదు బహుమతి ఇచ్చే ఈ సంప్రదాయాన్ని మైరే అంటారు. వ్యవసాయం చేసి జీవనం సాగించే ముగ్గురు అన్నదమ్ములు ఆరు లక్షల రూపాయలు పొదుపు చేసి మేనల్లుడికి పెండ్లి గిఫ్ట్ ఇచ్చారు. ముగ్గురు అన్నదమ్ములు, కోడలు, అత్తమామలు కలిసి రెండు ప్లాస్టిక్ బ్యాగుల్లో నింపిన డబ్బులను బస్తాల్లో నింపి తీసుకురావడంతో పెండ్లికి వచ్చిన అతిథులు ఆశ్చర్యపోయారు. బంధువులు, కులపెద్దల సమక్షంలో వ్యవసాయంలో వాడే బుట్టల్లో డబ్బులు లెక్కించి దాచారు.


దేశ్వాల్ గ్రామానికి చెందిన సీపూదేవికి ముగ్గురు అన్నదమ్ముళ్లు. రామ్ నివాస్ జాట్, కనకరామ్ జాట్, షైతాన్ రామ్ జాట్ తమ సోదరి సీపూ దేవి కొడుకు పెండ్లికి బస్తాల్లో నింపి తెచ్చిన డబ్బులు పెండ్లి కానుకగా ఇచ్చారు. ఈ డబ్బు లెక్కపెట్టడానికే మూడు గంటల సమయం పట్టిందట. మేనల్లుడికి మైరా నింపడం (ఒడి నింపడం) వారి తెగలో కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతోంది. మొఘల్ పాలన నుంచి లిచ్మా గుజారిని తమ సోదరిగా భావించి ఖిన్యాలా, జయల్ లోని జాట్లు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.