హృదయవిదారక వీడియో: ఆట మధ్యలో ప్రాణాలొదిలిన బాక్సర్

అతనో బాక్సర్, రింగులోకి దిగితే టైటిల్ గెలవాల్సిందే. ఆటే ప్రాణంగా ఆడతాడు. అలాంటి ఆటగాడు బాక్సింగ్ రింగులో హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. ఈ విషాద ఘటన మ్యూనిచ్‌లో వెలుగుచూసింది. ఓటమి ఎరుగని జర్మన్ ఛాంపియన్ మూసా యమక్ (38) , ఉగాండాకు హమ్జా వండేరాతో తలపడుతుండగా రింగ్‌లో ఈ సంఘటన జరిగింది. యూరోపియన్, ఆసియా ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్న అలుక్రాకు చెందిన బాక్సర్ యమక్‎ను గుండెపోటు వల్ల చిన్న వయస్సులోనే కోల్పోయాం అని టర్కీ అధికార ప్రతినిధి తెలిపారు.

మ్యాచ్ మూడో రౌండ్ ప్రారంభం కావడానికి ముందు యమక్ కుప్పకూలాడు. అంతకుముందు యమక్ రెండవ రౌండ్‌లో వాండెరా నుంచి పెద్ద హిట్‎కు గురయ్యాడు. ఆ తర్వాత యమక్ తడబడ్డాడు. రెండో రౌండ్ తర్వాత యమక్ మూడో రౌండ్‌లో మళ్లీ వాండెరాతో తలపడేందుకు ముందుకు వచ్చాడు. ఆ రౌండ్ ప్రారంభం కాకముందే అతడు కుప్పకూలడం వీడియోలో చూడవచ్చు. కిందపడిపోయిన యమక్ ను అక్కడే ఉన్న మెడిక్స్ పరిశీలించి.. స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే యమక్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. టర్కిష్‌లో జన్మించిన యమక్ 2017లో ప్రొఫెషనల్‌ ఆటగాడిగా మారాడు. యమక్ 2021లో WBFed ఇంటర్నేషనల్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత ప్రజాదరణ పొందాడు.