పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి వివాదాస్పద కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్

Union Minister Rameshwar Teli

Union Minister Rameshwar Teli

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై పెట్రోలియం, సహజవాయువుల శాఖ కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్ తేలి వివాదస్పద చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.

కోవిడ్ -19 వ్యాక్సిన్లు ఉచితంగా వేస్తున్నామని, దాని కారణంగానే పెట్రోల్-డీజిల్ ధరలు పెరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పెట్రోల్ రేటు ఎక్కువగా లేదు.. కేంద్రం, రాష్ట్రాలు దానిపై పన్నులు అధికంగా వేస్తున్నాయి. కేంద్రం ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్లు ఉచితంగా అందిస్తోంది. మరీ వ్యాక్సిన్లకు పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంధన ధరలపై విధించే పన్నుల నుంచే వ్యాక్సిన్లకు పైసలు వస్తున్నాయి. ఒక్కో వ్యాక్సిన్ డోసు ధర రూ.1,200 కాగా.. ఒక్కొక్కరికి రెండు డోసులు వేయాల్సి ఉంది. ’’ అని మంత్రి అన్నారు.

అలాగే హిమాలయన్ మంచినీళ్లు తాగాలంటే రూ.100 పెట్టాల్సి ఉంటుందని, లీటర్ పెట్రోల్ కంటే ఎక్కువే కదా.. అంటూ చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరిగితే, అందుకు తగ్గట్టే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. మా మంత్రిత్వ శాఖ ఈ ధరల్ని నియంత్రించదన్నారు. కోవిడ్ -19 పరిస్థితిని పరిష్కరించడానికి ఇటీవల తన మంత్రిత్వ శాఖ నిధులను ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మళ్లించారని రామేశ్వర్ తేలి చెప్పాడు.