వీడియో: బరాత్‎లో పెళ్లికొడుకు గన్ ఫైర్.. స్నేహితుడు మృతి

అందరూ తమ పెళ్లి వేడుక అందరికీ గుర్తుండిపోవాలనుకుంటారు. అందుకోసం పెళ్లిళ్లలో కొత్తకొత్త విధానాలకు తెరలేపుతుంటారు. ప్రీ వెడ్డింగ్ షూట్, మోహందీ, పెళ్లికొడుకు, పెళ్లి, రిసెప్షన్, బరాత్ ఇలా ఎన్నో కార్యక్రమాలు బంధుమిత్రులతో జరుపుకుంటుంటారు. కొంత మంది అయితే మరో అడుగు ముందుకేసి పెళ్లి బరాత్‎లో గన్ ఫైరింగ్ కూడా చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ఈ గన్ ఫైరింగ్ మిస్ ఫైరింగ్ అవుతోంది. దాంతో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా అటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్‎లో వెలుగుచూసింది.

సోన్‌భద్ర జిల్లా రాబర్ట్స్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రహ్మనగర్ ప్రాంతానికి చెందిన మనీష్ మాధేషియా వివాహం మంగళవారం జరిగింది. ఈ పెళ్లికి మనీష్ స్నేహితుడు, ఆర్మీ జవాన్ అయిన 38 ఏళ్ల బాబులాల్ యాదవ్‌ కూడా హాజరయ్యాడు. వివాహం పూర్తయిన తర్వాత బంధువులు, దోస్తులు అందరూ బరాత్ స్టార్ట్ చేశారు. ఇంతలో బాబులాల్ యాదవ్ తన తుపాకీ మనీష్‎కు ఇచ్చి గాలిలోకి కాల్చమన్నాడు. అయితే మనీష్ గాలిలోకి గన్ ఫైర్ చేసినప్పుడు పేలలేదు. దాంతో మనీష్ గన్ కిందికి దించి చూడబోయాడు. అంతలోనే వేలు నొక్కుకొని గన్ ఫైరయింది. ఆ బుల్లెట్ డైరెక్ట్ గా బాబులాల్ యాదవ్‎కు తగిలింది. దాంతో యాదవ్ కుప్పకూలిపోయాడు. వెంటనే బాబూలాల్ యాదవ్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించగా, అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. జవాన్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రాబర్ట్స్ గంజ్ పోలీసులు మనీష్ మీద హత్య కేసు నమోదు చేశారు. నిందితుడైన వరుడు మనీష్‌ను అదుపులోకి తీసుకున్నామని, అదేవిధంగా కాల్పులకు ఉపయోగించిన పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసు సూపరింటెండెంట్ అమరేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.