వెల్లుల్ల @ టెంపుల్ విలేజ్. ఎందుకా పేరు? ఏంటీ ఆ ప్రత్యేకత!

ఏ ఊరిలో అయినా మహా అంటే ఐదారు దేవాలయాలు ఉంటాయి. గ్రామం పొలిమేరలోనో.. మధ్యలోనో.. చివరనో టెంపుల్స్ ఉంటాయి. కానీ ఆ విలేజ్ లో మాత్రం వాడవాడలో ఓ టెంపుల్ ఉంది. గల్లీ గల్లీకో దేవుడు ఉన్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50కి పైగా ఆలయాలు ఆ ఊరి ప్రజల చేత పూజలందుకుంటున్నాయి. ఇంతకు ఇన్ని ఆలయాలు ఉన్న ఆ గ్రామం ఎక్కడుంది? అక్కడే ఎందుకన్ని ఆలయాలు ఉన్నాయి? ఒక్కసారి మనము తెలుసుకుందాం.

విలేజ్ లో 50కి పైగా ఆలయాలు

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెల్లుల్ల గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. చూడ్డానికి ఎంతో ప్రశాంతంగా, పచ్చదనంగా కనింపించే ఈ గ్రామంలో ఆధ్యాత్మిక భావన చాలా ఎక్కువ. ఏ ఊరిలో అయినా రెండు మూడు ఆలయాలు, ఉపాలయాలు ఉంటాయి. కానీ వెల్లుల్ల గ్రామంలో ఎటు చూసినా ఆంజనేయ స్వామి విగ్రహలు, ప్రతిమలే కనిపిస్తుంటాయి. ఊరి పొలిమేరల నుంచి మొదలు పెడితే ప్రతి వాడలోనూ.. ఊరి చివర కూడా హనుమంతుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ఊర్లోనే కాదు పంట పొలాల్లో కూడా భజరంగ్ భళీ రూపాలు కనిపిస్తున్నాయి. ఊరి మొత్తంలో కలిపి 50కి పైగా ఆలయాలు ఉన్నట్లు తెలుస్తోంది.

జైనుల కాలం నుంచి

ఈ గ్రామంలో ఇన్ని ఆలయాలు ఉండటానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. 13వ శతాబ్దంలో జైనులు పాలించే సమయంలో వెల్లుల్ల  గ్రామంలో దాదాపు 200 వరకు బ్రహ్మణ కుటుంబాలు ఉండేవని.. అందుకే తమ గ్రామాన్ని బ్రాహ్మణపురిగా పిలిచేవారని తెలిపారు. జైనులు తమ గ్రామంలో గండి హనుమాన్, ప్రహ్లాద సహిత లక్ష్మీ నరసింహ స్వామి, గణపతి విగ్రహాలను ఆలయాల్లో ఏర్పాటు చేశారు. ఇటు నాడు గ్రామంలో నివసించిన బ్రాహ్మణులు కూడా ఇంటి ముందు విగ్రహాలను ప్రతిష్టించుకని పూజలు చేసేవారని.. అదే సంప్రదాయం ఇంకా తమ ఊరిలో కొనసాగుతోందని చెబుతున్నారు. నాడు ప్రతిష్టించిన విగ్రహాలకే తాము ఇంకా పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నామన్నారు. దీంతో పాటు మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. సీతమ్మ జాడను వెతుక్కుంటూ లంకకు వెళ్లిన హనుమంతుడు గోదావరి తీరం వెల్లుల్ల గ్రామం నుంచి వెళ్లాడని.. అందుకే ఇన్ని విగ్రహాలు, ఆలయాలు ఏర్పాటు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

పొలాలు, చెరువు గట్ల దగ్గరు కూడా విగ్రహాలు

వెల్లుల్ల  గ్రామానికి పడమటి దిక్కున ఉన్న గండి హనుమాన్ ఆలయం మొదటిది. గ్రామస్తులు, రైతులు ఏ పని మొదలు పెట్టాలన్నా ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. స్వామిని దర్శించి పనులు మొదలు పెడితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతాయని గ్రామస్తులు చెబుఉన్నారు. గ్రామంలోని కొన్ని విగ్రహాలకు ఆలయాలు ఉండగా.. మరికొన్ని విగ్రహాలకు ఎలాంటి నిర్మాణాలు లేవు. అయినా భక్తులు తమ భక్తితో స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పచ్చని పంట పొలాలు, చెరువు గట్లపైనా, తోటల్లోనూ స్వామి విగ్రహాలే కనిపిస్తున్నాయి.

హనుమాన్ జయంతికి పండుగ వాతావారణం

ఊరంతా కొలువైన అంజన్నకు ప్రతి మంగళవారు, శనివారాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు హనుమాన్ జయంతి, శ్రీరామ నవమి సమయంలో కూడా ఊరంతా పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. ముఖ్యంగా హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామంలోని యువకులు, పెద్దలు, చిన్నలు అంతా హనుమాన్ దీక్షలు తీసుకుంటున్నారు.  హనుమాన్ జయంతి వేళ ప్రత్యేక భజనలతో వెల్లుల్ల గ్రామం మార్మోగుతుందని.. ఆలయ పూజారులు చెబుతున్నారు. వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నామన్నారు.

ఇతర దేవుళ్ల ఆలయాలు కూడా

హనుమాన్ ఆలయాలకు ప్రసిద్ధి గాంచిన వెల్లుల్ల గ్రామంలో పదికి పైగా నరసింహ ఆలయాలు, 6కు పైగా శివాలయాలు, గ్రామ దేవతలకు సంబంధించిన మరో 10 వరకు ఆలయాలు ఉన్నాయన్నారు. గ్రామంలో వెలిసిన ఎల్లమ్మ తల్లి జాతర ఎంతో వైభవంగా జరుగుతుందని చెబుతున్నారు. వెల్లుల్ల గ్రామంలో పురాతన ఆలయాలు ఎన్నో ఉండటంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా వెల్లుల్లకు క్యూ కడుతున్నారు.