మెదక్ లో ఓడిపోయిన విజయశాంతి.. ఇక్కడ రాజేందర్ ను గెలిపిస్తుందంట: హరీష్ రావు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జమ్మికుంట మండలం వెంకటేశ్వర పల్లి గ్రామంలో ధూమ్ ధామ్ కార్యక్రమం. మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఏ పార్టీ కి ఓటు వేస్తే మేలు జరుగుతోందో చూసి ఓటు వేయాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ కి అమ్ముడు పోయారు. చీకట్లో కలుసుకున్నారు. ఈటల రాజీనామా చేసింది రాజకీయ స్వార్ధం కోసం. నమ్మకానికి మారుపేరైన టీఆర్ఎస్ కు.. అబద్ధాల బీజేపీ మధ్య జరుగుతున్న పోటీ ఇది. ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చాము. 50 వేల నుండి లక్ష రూపాయల పంట రుణాలు మిత్తితో సహా వచ్చే ఉగాది తరవాత రుణమాఫీ చేస్తాం. బావుల దగ్గర మీటర్లు పెట్టొద్దు అంటే బీజేపీ పార్టీని మీ ఓటు ద్వారా బొంద పెట్టాలి. గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 అవుతుంది.. సిలిండర్ ధర తగ్గాలంటే బీజేపీ పార్టీ ని బొంద పెట్టాలి. ధరలు పెంచుతున్న బీజేపీ కి ఎందుకు ఓటు వేయాలి. పని చేసే ప్రభుత్వం టీ ఆర్ ఎస్ ప్రభుత్వం. 2004 లో కేసీఆర్ ను గులాబీ జెండాను చూసి ఈటలను గెలిపించారు. ఈటల హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తాడో చెప్పాలి. కేంద్రమంత్రి వచ్చి హుజురాబాద్ కి ఏం చేస్తాడో చెప్పట్లేదు. ఏం చేయనోడికి ఓటు ఎందుకు వేయాలి. మెదక్ లో ఓడిపోయిన విజయశాంతి. ఇక్కడ రాజేందర్ ను గెలిపిస్తుందంట.’’ అని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గంకు నాలుగు వేల ఇండ్లు కేటాయించారు. మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. ఇవాళ  బీజేపీ నుండి ఎమ్మెల్యే గా గెలిస్తే కట్టిస్తాడా.. ఆలోచించండి హుజురాబాద్ ప్రజలారా? నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.. కోట్ల రూపాయల ఆస్తులు లేవు…మీ సేవ చేయడానికి మీ బిడ్డగా వస్తున్నాను. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి.