నేతాజీ 125 వ జయంతి.. హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని

Virtual Netaji Subhas Chandra Bose statue to beam at India Gate till physical statue installed: PM Modi

స్వాతంత్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి నేడు. నేతాజీ జయంతిని పురష్కరించుకుని ఈరోజు సాయంత్రం 6 గంటలకు దేశ రాజధాని న్యూఢిల్లీ లోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించనున్నారు. స్వాతంత్ర్యం కోసం నేతాజీ చేసిన పోరాటానికి.. పరాక్రమానికి నివాళిగా గ్రానైట్‌తో చేసిన నేతాజీ గ్రాండ్ విగ్రహాన్ని (Netaji grand statue) ఇండియా గేట్ వ‌ద్ద ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. భారతదేశం ఆయనకు రుణపడి ఉంది అనేందుకు చిహ్నంగా ఈ విగ్రహం నిలువనుంది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని తాజాగా ట్వీట్ చేశారు.

ఇక నేతాజీ విగ్రహాన్ని నిర్మించే వరకు.. ఢిల్లీలోని ఐకానిక్ స్మారక చిహ్నం వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని (Netaji Hologram statue) ఉంచుతామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇక జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా హోలోగ్రామ్ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు.

కాగా ఇండియా గేట్ వ‌ద్ద ఏర్పాటు చేయ‌నున్న‌ నేతాజీ విగ్ర‌హం 28 అడుగుల ఎత్తు.. 6 అడుగుల వెడ‌ల్పు ఉండనున్నట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. మ‌రోవైపు నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఈ ఏడాది నుంచి గణతంత్ర దినోత్సవ వార్షిక వేడుకలు ప్రారంభమయ్యే తేదీని మార్చారు. జనవరి 24కు బదులుగా జనవరి 23న గణతంత్ర దినోత్సవ వార్షిక వేడుకలు ప్రారంభమవుతాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెలిపింది. నేతాజీ జ్ఞాపకార్థం ఏటా జనవరి 23ను పరాక్రమ్ దివస్‌గా పాటిస్తామంటూ కేంద్రం గతేడాది ప్రకటించింది.