మేజర్ సినిమా కాదు.. ఒక ఎమోషన్

అడివి శేష్ హీరోగా నటించిన ‘మేజర్’ సినిమా కాదని, అది ఒక ఎమోషన్ అని టీమిండియా మాజీ ఆటగాడు, ఎన్‎సీఏ చైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్‌’. అడివి శేష్‌ లీడ్‌ రోల్‌ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు.

తాజాగా ఈ చిత్రంపై జాతీయ క్రికెట్‌ అకాడమీ చైర్మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ‘ఇప్పుడే మేజర్‌ సినిమా చూశాను. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఒక ఎమోషన్‌. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజమైన స్ఫూర్తిదాయకమైన కథ ఇది. మీకు బాగా నచ్చుతుంది. అడివి శేష్‌ అద్భుతంగా నటించి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. అందరూ కచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది’ అని లక్ష్మణ్‌ ట్వీట్‌ చేశాడు.

జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటున్నారు.