నాడు చుక్క నీటి కోసం కోటి తిప్పలు.. నేడు ఎండిపోయిన బోరు బావుల్లో ఉబికి వస్తోన్న గంగా

రంగారెడ్డి జిల్లా: నాడు చుక్క నీటి కోసం కోటి తిప్పలు పడగా.. నేడు ఎండిపోయిన బోరు బావిల్లో భూగర్భ జలం పొంగిపొర్లుతోంది. కరెంటు లేకుండానే, మోటారు వేయకుండానే బోరు బావి నుండి  గంగమ్మ పైకి వస్తోంది. గతంలో ఎనిమిది వందల నుండి వెయ్యి అడుగులు బోరు వేసినా చుక్కనీరు పడని ఇదే బోరుబావిలో ఇవాళ నీరు పొంగిపొర్లుతోంది.

ఈ ఆసక్తికర దృశ్యం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గత వారం పది రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలలో ఉన్న పెద్ద, చిన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు అన్ని నిండిపోయాయి.

కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగి గ్రామాలు మునిగిపోయాయి. పట్టణాలు సైతం వరద నీటిలో నిర్భందించబడ్డాయి. అయితే ఈ వర్షాల ప్రభావంతో భూగర్భ జలాలు కూడా చాలా పెరిగాయి. పుష్కలంగా నీరు చేకూరింది. దీంతో జిల్లాలోని శంకర్ పల్లి మండలం మియాఖాన్ గడ్డ గ్రామానికి తాగునీరు అందించే బోరు బావిలోంచి నీరు పైకి ఉబికి వస్తోంది. ఈ దృశ్యాన్ని చూడడానికి చాలా గ్రామస్తులు క్యూ కట్టారు. ఏదేమైనా ఈ సారి వర్షాలకు, నీటికి, పంటలకు ఎటువంటి ఢోకా లేదు.