స్విమ్స్ పరిధిలోకి టీటీడీ దవాఖానాలు-వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ కి సంబంధించిన అన్ని దవాఖాలను స్విమ్స్ పరిధిలోకి తెస్తామని స్విమ్స్‌ యూనివర్సిటీ చైర్మన్‌, ఛాన్సలర్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. పరిపాలన సౌలభ్యం, పరికరాలు, విభాగాలు డూప్లికేషన్‌ను నివారించడం, అనవసర ఖర్చులను నివారించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తిరుపతిలోని స్విమ్స్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైవీ సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విలీనం చేసే ఆసుపత్రులలో సిబ్బంది పంపిణీని సులభతరం చేస్తామన్నారు. బర్డ్‌ ఆసుపత్రి, రాబోయే శ్రీ పద్మావతి పీడియాట్రిక్ దవాఖానాలో పీజీ, సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సులను పొందేందుకు వీలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ‘శ్రీ వెంకటేశ్వర హెల్త్ యూనివర్సిటీ’గా నామకరణం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్విమ్స్‌ డైరెక్టర్‌ కమ్‌ వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ బీ వెంగాయమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ స్నాతకోత్తర ప్రసంగం చేశారు. టీటీడీ జేఈఓ వీ వీరభ్రదం, డాక్టర్‌ ఎన్టీఆర్ ఆరోగ్య వర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ డాక్టర్ శ్యాంప్రసాద్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌ రామ్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కేవీ శ్రీధర్‌ బాబు, డీన్‌ డాక్టర్‌ అల్లాడి మోహన్‌, డాక్టర్‌ వనజ, తదితరులు కూడా పాల్గొన్నారు.