సొంత స్థలంలో ఇండ్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు ఇస్తాం: హరీష్ రావు

Minister Harish Rao participated in dhoom dham

Minister Harish Rao participated in dhoom dham

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో ధూమ్ ధామ్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే లు ఆరూరి రమేష్, గాదరి కిషోర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, సైది రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ‘‘ఈటల రాజేందర్ కి ఓటమి భయం పట్టుకుంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏడేండ్ల కాలంలో ఏం పని చేసిందో.. ముందుందు ఏం చేస్తుందో చెప్పి ఓట్లు అడగాలి. బీజేపీ అబద్ధాలు చెప్పే పార్టీ. ఈటల కూడా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నాడు. హరీష్ రావు చెల్లని చెక్కులు ఇచ్చాడు అని ఈటల  అబద్ధాలు చెప్తున్నాడు. వావిలాల మండలం కావాలని మీరు 36 రోజులు దీక్ష చేశారు. ఈటల  మండలం చేయలేదు. గెల్లు శ్రీను ని గెలిపించండి.. వావిలాల ను మండలం చేసే బాధ్యత నాది. రాజేందర్ మంత్రిగా ఉన్నన్ని రోజులు ఏం చేయలేదు. ఇప్పుడు గెలిచి ఏం చేస్తాడు.. బీజేపీ పేద ప్రజలకు ఏం చేస్తారో చెప్పట్లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ లు, కళ్యాణ లక్ష్మీ వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ మొదట దళితులకు మాత్రమే ఇచ్చారు. తరువాత అన్ని కులాల్లోని పేదలకు ఇస్తున్నారు.

బీజేపీ గెలిస్తే బావుల దగ్గర మోటార్ లు వస్తాయి. రైతన్నలారా జాగ్రత్త. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ 1020 రూపాయలు చేసింది. ఈటల రాజేందర్ కి చేతనైతే కేంద్రాన్ని ఒప్పించి గ్యాస్ ధర తగ్గించాలి. సబ్సిడీ ఇవ్వాలి. అక్టోబర్ 30వ తేదీన గ్యాస్ సిలిండర్ కి దండం పెట్టి. బీజేపీ ని బొంద పెట్టాలి. ధరలు పెంచుతున్న బీజేపీ కి గుణపాఠం చెప్పాలి. సొంత స్థలంలో ఇండ్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తాము. బీజేపీ ఎంపీ అరవింద్ పసుపు బోర్డ్ ఇస్తా అని బాండ్ పేపర్ రాసి ఇచ్చి ఇవ్వలేదు. ఎంపీ అరవింద్ హుజురాబాద్ వచ్చి అన్ని అబద్ధాలు చెవుతున్నాడు. పేదింటి బిడ్డ బిసి బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించండి. సీఎం కేసీఆర్ సంపద పెంచిండు… పేదలకు పంచిండు. కానీ బీజేపీ దేశ సంపద కార్పొరేట్ కంపెనీ లకు దోచిపెడుతుంది.’’ అని హరీష్ రావు బీజేపీ, ఈటలపై మండిపడ్డారు.