కిర్లోస్క‌ర్ ఫ్యామిలీ వివాదాన్ని మధ్యవర్తిత్వంతో పరిష్కరిస్తాం.. జస్టిస్ ఎన్వీ రమణ - TNews Telugu

కిర్లోస్క‌ర్ ఫ్యామిలీ వివాదాన్ని మధ్యవర్తిత్వంతో పరిష్కరిస్తాం.. జస్టిస్ ఎన్వీ రమణ



పేరొందిన వ్యాపార కుటుంబం మ‌ధ్య ఏండ్ల త‌ర‌బ‌డి వివాదం కొన‌సాగ‌డం.. వారికి మంచిది కాద‌ని సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అన్నారు. ప్ర‌ముఖ పారిశ్రామిక సంస్థ కిర్లోస్క‌ర్ గ్రూప్ కుటుంబ స‌భ్యులు పరష్కారం దిశగా ఆలోచించాలని అన్నారు. ఇలా ఏండ్ల తరబడి తగాదాలు కొనసాగడం కంపెనీకి ల‌బ్ది చేకూర‌ద‌ని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ చెప్పారు. కుటుంబ స‌భ్యుల, ఉమ్మ‌డి స్నేహితుల మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో వివాద ప‌రిష్కారానికి చొర‌వ చూపాల‌ని ఆయన సూచించారు.

మ‌ధ్య‌వ‌ర్తిత్వానికి న్యాయ‌మూర్తిని నియ‌మిస్తాం

కిర్లోస్క‌ర్ కుటుంబ స‌భ్యుల మ‌ధ్య చాలా కాలంగా వివాదం కొన‌సాగుతున్న‌ది. ఇరు ప‌క్షాలు ఒప్పుకుంటే మ‌ధ్య‌వ‌ర్తిత్వానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తిని నియ‌మిస్తామ‌ని సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, జ‌స్టిస్ సూర్య‌కాంత్ సార‌ధ్యంలోని ధ‌ర్మాస‌నం ప్ర‌తిపాదించింది.

ఆర్బిట్రేష‌న్‌కు పంపాలి.. బాంబే హైకోర్టు 

ఈ వివాదాన్ని ఆర్బిట్రేష‌న్‌కు పంపాల‌ని బాంబే హైకోర్టు గ‌త నెల 21న ఆదేశించగా  దీన్ని సవాల్ చేస్తూ సంజ‌య్ కిర్లోస్క‌ర్, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిష‌న్‌ను జ‌స్టిస్ ర‌మ‌ణ‌, జ‌స్టిస్ సూర్య‌కాంత్ సార‌ధ్యంలోని ధ‌ర్మాస‌నం విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను ఆరు వారాల‌కు వాయిదా వేసింది.

అయితే తాజా మ‌ధ్య‌వ‌ర్తిత్వ ప్ర‌య‌త్నాల‌ను వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పుణెలోని సివిల్ కోర్టు ఆదేశం మేర‌కు డీడ్ ఫ‌ర్ ప్యామిలీ సెటిల్మెంట్ (డీఎఫ్ఎస్‌) అమ‌లు చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నట్లు వెల్లడించారు.