బీరు సీసాలు గ్రీన్, బ్రౌన్ కలర్ లో ఎందుకుంటాయి?

ఈ రోజు డిసెంబర్ 31. అందరూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే జోష్ లో రాత్రంతా ఫుల్ మత్తులో ఊగిపోతుంటారు. డ్రింక్ ప్రియులు రాత్రంతా తాగుతూ.. ఎంజాయ్ చేస్తూ చిందులేస్తారు. అయితే.. ఎంజాయ్ మెంట్ మూడ్ లో చాలా విషయాలను పెద్దగా పట్టించుకోరు. అందులో భాగమే న్యూ ఇయర్ కి వెల్ కమ్ చెప్తూ పార్టీ చేసుకునే మందు బాటిళ్లు. ఒక్కొక్కరు తమకిష్టమైన బ్రాండ్ బాటిల్స్ తెచ్చుకొని పార్టీ చేసుకుంటారు. సీసాలు ఖాళీ చేసి ధూంధాం ఎంజాయ్ చేస్తారు. అయితే బీరు సీసాల కలర్ గమనించారా? ఇదేం ప్రశ్న.. గ్రీన్, బ్రౌన్ కలర్ లో ఉంటాయి అని టక్కున చెప్పేస్తారు. మరి అదే రంగులో ఎందుకుంటాయి? అంటే మాత్రం చాలామందికి తెలియదు. ఎప్పుడు చూడూ.. సీసాలు ఖాళీ చేయడమే కాదు. అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు కూడా తెలుసుకోవాలి.

పార్టీ అయినా.. ఫంక్షన్ అయినా.. ప్రోగ్రామ్ అంతా అయిపోయాక చివర్లో బీర్లు పొంగాల్సిందే. కంటికి కనిపించగానే ఖాళీ చేసేసి పక్కన పడేస్తారు. కానీ.. ఆ బాటిల్స్ ఎందుకు గ్రీన్, బ్రౌన్ కలర్ లోనే ఉంటాయనే విషయం ఎవరూ పట్టించుకోరు. దాని గురించి కూడా ఆలోచించరు.


బీర్ తయారుచేసిన తొలిరోజుల్లో బీర్ ను ట్రాన్స్ పరెంట్ సీసాల్లోనే అమ్మేవారు. అయితే.. బీర్లు నిత్యం ఫ్రిజ్ లో ఉంచడం కుదరే పని కాదు. తయారుచేసిన బీర్లన్నీ కూల్ లో పెట్టాలంటే.. భారీ స్థాయిలో బేవరేజెస్ అవసరం ఉంటుంది. అందుకే.. అమ్మడానికి కొన్ని గంటల ముందు ఫ్రిజ్ లో పెట్టి చిల్డ్ గా అమ్ముతుంటారు. అయితే.. ట్రాన్స్ పరెంట్ బాటిల్స్ లో బీర్ నిల్వ చేయడం వల్ల ఆ రోజుల్లో అది పాడై పోయి దుర్వాసన వచ్చేదట. సీసాల గుండా సూర్యరశ్మి ప్రసరించి సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాలుబీర్ లోని యాసిడ్ మీద ప్రభావం చూపించేదట. దీంతో ఆ యాసిడ్లకు, సూర్య కిరణాలకు చర్య జరిగి నిల్వ ఉంచిన బీర్లుపాడైపోయేవట.


ఆ తర్వాత దీనికి పరిష్కారం ఏంటా అని ఆలోచించారు. కొన్ని రోజుల తర్వాత తయారుచేసిన బీర్లను నిల్వ చేయడానికి రంగు సీసాలు వాడారు. దీంతో బీర్ పాడుకాలేదు. అప్పటి నుంచి ఫలానా బ్రాండ్ కి ఫలానా కలర్ అని కొన్ని బ్రాండ్లకు బ్రౌన్ కలర్, కొన్ని బ్రాండ్ల బీర్లకు గ్రీన్ కలర్ వాడుతున్నారు. అయితే.. బ్రౌన్ కలర్ ఎందుకు ఎంచుకున్నారంటే.. ఈ రంగు యూవీ కిరణాలను సీసాలోని ద్రవంతో ప్రతిస్పందించకుండా అడ్డుకుంటుంది.


మరి గ్రీన్ కలర్ సీసాలు బీర్లు నిల్వ చేయడానికి ఎందుకు వాడారంటే.. దానికి కూడా ఓ కారణం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో.. ప్రపంచంలో బ్రౌన్ కలర్ గాజుసీసాల కొరత ఏర్పడింది. దీంతో మళ్లీ ట్రాన్స్ పరెంట్ సీసాల్లో బీరు ద్రావణం నిల్వ చేయాల్సి వచ్చింది. ఈ సీసాల వాడకం రాయల్‌గా లేదని, అది బీర్ల అమ్మకాలపై ప్రభావితం చూపిస్తుందని తెలుసుకున్నారు. బ్రౌన్ కలర్ కి ప్రత్యామ్నయంగా బీర్ బాటిళ్లు ప్రీమియంగా కనిపించడానికి ఆకుపచ్చ రంగు సీసాలను ఉపయోగించడం ప్రారంభించారు. అలా.. అప్పటి నుంచి బీర్ బాటిల్స్ బ్రౌన్, గ్రీన్ కలర్ లోనే కొనసాగుతున్నాయి.