వైరస్‌లు మనుషుల  మీదే ఎందుకు దాడి చేస్తాయి.. ఇంకా గుర్తించని వైరస్‌లు చాలా ఉన్నాయా?

జీవ పరిణామ క్రమం మొదలైనప్పటి నుంచి జీవజాలంలో ఎన్నో వైరస్‌లు ఉన్నాయి. కొన్ని వందల, వేల ఏండ్ల నుంచి జంతువులు, పక్షుల్లో స్వతహాగా వైరస్ లు ఉంటాయి. కాకపోతే అవి మనుషుల మీద దాడి చేయవు.  చేయలేవు కూడా. కానీ.. మారుతున్న వాతావరణం, పర్యావరణం కారణంగా ఆయా వైరస్‌లు మనుషుల మీద కూడా  ప్రభావం చూపిస్తున్నాయి. దాని ఫలితమే ఇప్పుడు ప్రపంచం ఎదుర్కుంటున్న పలు అనారోగ్య, రోగ  కారక వైరస్‌ జ్వరాలు. ప్రకృతి సమతుల్యత దెబ్బ తినడమే దీనికి ప్రధాన కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. వన్యప్రాణులు, అటవీ జీవజాతులకు ఆవాసమైన అడవులు క్రమంగా అంతరించిపోవడం వల్లనే వాతావరణంలో మార్పులు చోటు  చేసుకుంటున్నాయని.. అడవుల్లో ఉండాల్సిన జీవజాలం, వైరస్‌లు జనావాసాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయని సైంటిస్టులు చేసిన పలు అధ్యయనాల్లో తేలింది. వ‌న్యప్రాణుల మాంసం తిన‌డం వ‌ల్ల కూడా వాటి ద్వారా వైర‌స్‌ మ్యుటేష‌న్ జరిగి మనుషుల్లో పలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని వారంటున్నారు.

భయపెడుతున్న కొత్త వేరియంట్లు

ఎవరూ ఊహించని విధంగా ప్రపంచాన్ని వణికించింది కరోనా మహమ్మారి. ఇప్పటికీ తన ఉనికిని చాటుకోవడానికి రకరకాల వేరియంట్లుగా రూపాంతరం చెందుంతోంది. వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరో సరికొత్త వేరియంట్లలో దాడి చేస్తూ ఇప్పటికీ ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఓమిక్రోన్ వేరియంట్ ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. మనుషుల మీద ఇలాంటి వైరస్ లు దాడి చేయడం ఇది తొలిసారి కాకపోయినప్పటికీ ప్రాణాంతక వైరస్ లుగా మారి జనాల ప్రాణాలు తీస్తుండటంతో ప్రపంచ దేశాల ప్రజలను ప్రాణభయం  వెంటాడుతోంది. మనుషులపై ఇలాంటి మహమ్మారుల దాడి ఇదే మొదటిదీ కాదు.. అలా అని ఇదే చివరిదయ్యే అవకాశం కూడా లేదని పరిశోధకులు చెబుతున్నారు. తరచూ ఏదో ఓ కొత్త వైరస్‌ కారకాలు జనాల మీద దాడి చేస్తూనే ఉన్నాయి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? కారణాలు ఏమిటి? భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంది.. అనే సందేహాలు సగటు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనిపై ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్లాట్‌ఫాం ఆన్‌ బయోడైవర్సిటీ అండ్‌ ఎకోసిస్టమ్‌ సర్వీస్‌ (ఐపీబీఈఎస్‌) ఇటీవల అధ్యయనం చేసి ఓ నివేదిక విడుదల చేసింది. మనుషులకు కొత్తగా సంక్రమిస్తున్న వైరస్‌లు, రోగాలు అన్ని జంతువులు లేదా పక్షుల నుంచి వ్యాపిస్తున్నవేనని తేల్చి చెప్పింది.

మ్యూటేషన్‌ చెంది మనుషులపై ప్రభావం..

ప్రాథమికంగా జంతువులు, పక్షుల్లోనే ఉండి వాటిపైనే ప్రభావం చూపే సూక్ష్మజీవులు ప్రకృతి సమతుల్యత వల్ల మ్యూటేషన్‌ చెంది మనుషులపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఇలాంటి వ్యాధులను జూనోటిక్‌ లేదా జూనోసెస్‌ అని పిలుస్తారు. 1940 దశాబ్దం నుంచి ఇప్పటి వరకు మొత్తం 330 అంటువ్యాధులను గుర్తించారు. అందులో 60 శాతానికిపైగా జంతువులు, పక్షుల నుంచి మనుషులకు వ్యాపించినవే అని అధ్యయనం చెబుతోంది. జంతువులు, పక్షుల నుంచి మనుషులకు విస్తరిస్తున్న కొత్త వ్యాధుల సంఖ్య ఏటేటా పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొన్నిరకాల వైరస్‌లు సామర్థ్యం పెంచుకుని మహమ్మారులుగా మారుతున్నాయి. ఎబోలా, జికా, నిఫా వంటి ప్రమాదకర వ్యాధులను కలిగించే వైరస్‌లలో 70 శాతానికిపైగా అడవి జంతువుల నుంచి, అలాగే పెంపుడు జంతువుల నుంచి వ్యాపించినవేనట.

ఇంకా గుర్తించని వైరస్‌లు ఎన్నో..

నిజం చెప్పాలంటే భూమ్మీద కొన్ని కోట్ల రకాల వైరస్‌లు ఉన్నాయి. వాటిలో మనం గుర్తించనవి, గుర్తించగలిగేలా ఉన్న వైరస్‌లు చాలా తక్కువ. గుర్తించాల్సిన వైర‌స్‌లు 17 ల‌క్షల‌కు పైగానే ఉంటాయ‌ని శాస్త్రవేత్తల అంచ‌నా. వాటిలో 6.3 ల‌క్షల నుంచి 8.2 ల‌క్ష‌ల వైర‌స్‌లు ప్రాణాంతకమైనవట. మనుషుల‌కు సోకి ప్రాణాలు తీసే సామర్థ్యం ఈ రకం వైరస్‌లకి ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.

ఇప్పుడేం చేయాలి?

ప్రకృతితో కలిసి జీవించాల్సిన మనిషి ప్రకృతి మీద  ఆధిపత్యం చెలాయిస్తూ.. పర్యావరణాన్ని ధ్వంసం చేయడం వల్లే ఈ వైరస్‌లు పుట్టుకొచ్చాయన్నది పరిశోదకుల వాదన. ఇప్పటికైనా ప్రకృతితో కలిసి జీవిస్తే ఇలాంటి కొత్త సమస్యలు తలెత్తవని చెప్తున్నారు. కొత్త వైరస్‌లు వచ్చిన తర్వాత వాటిని నియంత్రించేందుకు కష్టపడటం కంటే.. అసలు వైరస్‌లు ప్రబలకుండా జాగ్రత్తపడటమే మంచిదని వారు సూచిస్తున్నారు. అడవులు నరకడం, వన్యప్రాణుల వేట పూర్తిగా ఆపేయాలని హెచ్చరిస్తున్నారు. జంతువులు, పక్షుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్‌లను ముందుగానే గుర్తించేందుకు చర్యలు చేపట్టాలంటున్నారు.