లైంగికంగా వేధిస్తున్నాడని భర్తను చంపేసిన భార్య

పడక గదిలో లైంగికంగా వేధిస్తున్న భర్త తీరు భరించలేకోపోయిన ఓ మహిళ గొడ్డలితో నరికి భర్తను హత్య చేసింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మర్కంటి ఎల్లయ్య (55), నర్సవ్వ (50)లకు ముప్పై ఏండ్ల కింద పెండ్లైంది. కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవారు. వీరికి ఒక కుమార్తె. ఆమెకు ఏడేండ్ల క్రితం పెండ్లి చేశారు. కాగా.. ప్రస్తుతం నర్సవ్వ, ఎల్లయ్య ఇద్దరే ఉంటున్నారు. కాగా.. కొన్నేండ్లుగా భర్త ఎల్లయ్య భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. శారీరకంగా కలవాలంటూ కొట్టడం ప్రారంభించాడు. లైంగికంగా కలవడం లేదన్న కోపంతో చిన్న చిన్న కారణాలకకే చితకబాడేవాడు. మూడు నెలల క్రితం కూర రుచిగా లేదని ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. గ్రామ పెద్దల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.


కాగా.. సోమవారం నర్సవ్వను ఎల్లయ్య మరోసారి లైంగిక వాంఛ తీర్చమని అడిగాడు. అందుకు నర్సవ్వ సహకరించలేదు. దీంతో ఆమెకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ గొడ్డలి కర్రతో కొట్టాడు. తీవ్ర గాయాలతో ఆమె అదే గ్రామంలోని కూతురు ఇంటికి వెళ్లింది. గ్రామ పెద్దలు నర్సవ్వకు నచ్చజెప్పి ఇంటికి పంపించారు. ఆమె గ్రామంలోని కుమార్తె ఇంటికి వెళ్లింది. బుధవారం నాడు రాత్రి ఎల్లయ్య మళ్లీ లైంగికంగా వేధించాడు. అర్ధరాత్రి తరువాత మరోసారి సతాయించగా ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమె బయటకు వెళ్లేందుకు వీలు లేకుండా ఇంటి గడియ వేసి, గొడ్డలి కర్రతో భార్యపై ఎల్లయ్య మళ్లీ దాడి చేశాడు. దెబ్బలకు తాళలేక, ఇంట్లోంచి పారిపోయే అవకాశం లేక నర్సవ్వ ఏడుస్తూనే ఇంట్లో ఓ మూలకు నక్కింది. కొద్దిసేపటి తర్వాత ఎల్లయ్య నిద్రలోకి జారుకున్న తర్వాత నర్సవ్వ అక్కడే ఉన్న గొడ్డలితో భర్త మెడపై వేటు వేసింది. ఎల్లయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తెల్లవారుజామున స్థానికులు గమనించి విషయాన్ని కూతురుకి చెప్పారు. కూతురు ఫిర్యాదు మేరకు సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజేశ్‌ ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వచ్చే వరకు అక్కడే ఉన్న నర్సవ్వను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆమె పడిన ఇబ్బందులను, కష్టాలను చెప్తూ కన్నీళ్లు పెట్టకుంది.