Tuesday, May 21, 2024

ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేయాలో క్లియర్‎గా చెప్పిన నాని

spot_img

ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ హిట్ నడుస్తోంది. ఎన్నికల సమరం దగ్గరపడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అందులో భాగంగా రాజకీయ నేతలు ఏ ఫ్లాట్ ఫామ్‎ను కూడా వదలకుండా ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని సైతం ప్రచారంలోకి దిగారు. మీ ఓటు తమకే వేసి గెలిపించాలని కోరుతున్నాడు.

ఇదేంటి నాని ఎక్కడి నుంచి పోటీచేస్తున్నాడా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే అసలు విషయం ఏంటంటే.. నాని, మృణాల్ ఠాకూర్ నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్త దర్శకుడు శౌర్యవ్ తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన నాని, మృణాల్.. దేన్నీ వదలకుండా సినిమా గురించి హైప్ ఇచ్చేస్తున్నారు. అందులో భాగంగానే రాజకీయ నాయకుడి గెటప్ వేసి తమ సినిమాను విజయవంతం చేయాలని కోరుతున్నాడు. రాజ‌కీయ నాయ‌కుడి గెట‌ప్‌లో ఉన్న నాని తాజాగా ఒక వీడియో విడుద‌ల చేశారు. ‘రిలీజ్ దెగ్గరలో ఉంది. ఎలక్షన్స్ మధ్యలో వున్నాయి. వాడేయటమే’ అంటూ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నట్లు వీడియో ఉంది.

ఇక ఈ వీడియో చూస్తే.. మీ ‘హాయ్‌ నాన్న’ పార్టీ ప్రెసిడెంట్‌ విరాజ్‌ అని నాని మాట్లాడుతూ త‌న మేనిఫెస్టో ప్ర‌క‌టించాడు. మన హాయ్ నాన్న పార్టీ కనుక అధికారంలోకి వస్తే.. యూత్ అందరికి రీల్స్ చేసుకోడానికి విచ్చలవిడిగా స్మార్ట్ ఫోన్స్ అండ్ లైటింగ్ సెటప్‎ కిట్లు పంచి పెడతాం. అందరి ఆదాయం పెంచేలా చూస్తాం. థియేటర్‌ల ఆదాయం, అలాగే వాటి పక్కన ఉన్న కిరాణా కొట్టుల ఆదాయం కూడా పెంచేలా చూస్తాం. వీడియో చివరలో సోష‌ల్ రెస్పాన్సిబిలిటీని కూడా తెలిపాడు. మా పార్టీకే ఓటు వేయండి అని పొలిటీషియన్స్ ఇలాంటి క‌బుర్లు ఎన్ని అయినా చెబుతారు. కానీ మీ మనసుకు తెలుసు. ఆలోచిస్తే మీకే అర్థమయిపోతుంది. మంచోడికే ఓటు వేయండి. మంచి సినిమానే చూసేయండి అంటూ నాని చెప్పుకొచ్చారు.

Latest News

More Articles