Sunday, May 12, 2024

బిడ్డను కనాలనుకునే దంపతులు వీటిని పాటించండి

spot_img

కొత్తజీవి ఊపిరిపోసుకోవాలంటే.. పురుషుడి వీర్యకణాలు స్త్రీల అండంతో కలవాలి. జీవనశైలి లోపాల వల్ల వీర్యకణాల సంఖ్య, నాణ్యతపై చెడు ప్రభావం పడుతున్నది. గర్భధారణకు గండాలు ఎదురవుతున్నాయి. కాబట్టి, బిడ్డను కనాలనుకునే దంపతులు.. వీర్య కణాలపై ప్రతికూల ప్రభావం చూపే అంశాల పట్ల అవగాహన పెంచుకోవాలి. పండంటి శిశువుకు జన్మనిచ్చే అవకాశాలు మరింత మెరుగుపర్చుకోవాలి.

సిగరెట్‌, ఆల్కహాల్‌: సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల్లో 2,000 రకాల రసాయనాలు ఉంటాయి. వాటిలో మరీ హానికరమైనది నికోటిన్‌. ధూమపానం వీర్యకణాల చలనాన్ని తగ్గించి వేస్తుంది. దీంతో కొన్ని వీర్యకణాలు మాత్రమే అండాన్ని చేరుకుంటాయి. అలా పురుషుల్లో ధూమపానం స్త్రీలకు మాతృత్వాన్ని దూరం చేస్తుంది. అంతే కాదు, వీర్యంలోని డీఎన్‌ఏకు హానిచేస్తుంది. దీంతో గర్భధారణ ఓ సమస్యగా మారుతుంది. మద్యపానంతో కూడా ఇవే సమస్యలు తలెత్తుతాయి. పైగా వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి, సంతానాన్ని కోరుకునే వాళ్లు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

Read Also: రోదసిలో గ్యాస్ స్టేషన్! లాభాలు పుష్కలం..

ఊబకాయం: వీర్యకణాల నాణ్యత మీద ఊబకాయం తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సమస్య ఫలితంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్‌, టెస్టోస్టిరాన్‌ హార్మోన్ల నిష్పత్తి మీద దెబ్బ పడుతుంది. అధిక బరువు సమస్య వృషణాల చుట్టూ ఉష్ణాన్ని అధికం చేస్తుంది. దీంతో వీర్యకణాల సంఖ్య, నాణ్యత రెండూ కూడా పడిపోతాయి.

గ్యాడ్జెట్లు, బిగుతు బట్టలు: ఎక్కువ కాలంపాటు ల్యాప్‌టాప్‌ వాడటం, నిత్యం బిగుతు ప్యాంట్లు ధరించడం వల్ల వృషణాలు అధిక వేడికి గురవుతాయి. ఇది వీర్యకణాల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. వాటి సంఖ్య, నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి, వృషణాల మీద ఒత్తిడి పడకుండా చూసుకోవాలి.

ఆహారం: వీర్యకణాల ఆరోగ్యం మీద ఆహారం ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ట్రాన్స్‌ఫ్యాట్లు అధికంగా ఉన్న రుచులు, ప్యాకేజ్డ్‌, రెడీ టు ఈట్‌ చిరుతిళ్లు.. వీర్యకణాల నాణ్యతను తగ్గిస్తాయి. చక్కెర అధికంగా ఉండే కార్బొనేటెడ్‌ పానీయాలు తాగకపోవడం మంచిది. తాజా పండ్లు, కూరగాయలు, ముతక ధాన్యాలతో కూడిన సమతుల ఆహారం తప్పక తీసుకోవాలి. ప్రాసెస్డ్‌ తిళ్లు, వేపుళ్లు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి.

నిద్రలేమి: వీర్యకణాల ఆరోగ్యానికి కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. క్రమబద్ధమైన నిద్ర అలవాటు లేకపోవడం, శారీరక శ్రమ కరువైపోవడం.. తదితర కారణాలు జీవన చక్రాన్ని దెబ్బతీస్తాయి. వీర్యకణాల చలనశీలత, నాణ్యత పెరగడానికి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు.

Latest News

More Articles