Tuesday, May 21, 2024

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. పార్లమెంటులో బీఆర్ఎస్ గళం

spot_img

ఈ నెల 18వ తేదీ నుంచి జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపధ్యంలో ఆదివారం న్యూఢిల్లీలో కేంద్రం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. సమావేశాలు సజావుగా జరిపేందుకు, అన్ని పార్టీల వారి సంపూర్ణ సహకారం కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశం నిర్వహించింది. బీఆర్ఎస్ తరపున పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు , లోక్ సభా పక్ష నాయకులు , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో బీఆర్ఎస్ ఎంపీలు గళం ఎత్తుతారని నామ అన్నారు. ఓబీసీలు, మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులు ఆమోదించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామని తెలిపారు.

ఈ మేరకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కి లేఖ కూడా రాయడం జరిగిందని అన్నారు.బీసీలు, మహిళా హక్కుల సాధనకు, వారికి సమున్నత స్థానం కల్పించేందుకు బీఆర్ఎస్ తరపున పార్లమెంట్ లో పెద్ద ఎత్తున గళం వినిపిస్తామని స్పష్టం చేశారు. బీసీ, మహిళా రెండు బిల్లులు ఈ ప్రత్యేక సమావేశాల్లోనే ప్రవేశపెట్టి,ఆమోదించేలా పోరాడతామని చెప్పారు. మిగతా అన్ని సమస్యలపైనా కేంద్రాన్ని నిలదీస్తామని నామ అన్నారు.మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు బిల్లుపై తెలంగాణ మొట్ట మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్రానికి పంపినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. రాజకీయాల్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంచేందుకు, వారి హక్కులు కాపాడేందుకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని నామ చెప్పారు.

Latest News

More Articles