Monday, May 20, 2024

సమరానికి సై అంటున్న ‘టీమ్‌ తెలంగాణ’.. కెప్టెన్‌‎గా కేసీఆర్‌

spot_img

వరల్డ్‌ కప్‌ సమరంలో టీమ్‌ ఇండియా అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్నది. మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని రోహిత్‌ సేన పట్టుమీదున్నది. అనుభవజ్ఞులు, యంగ్‌ తరంగ్‌లతో కూడిన మన జట్టు కాకలు తీరిన ఆసీస్‌ను కంగు తినిపించింది. దాయాది జట్టుకు యాది మరవలేని ఓటమిని కానుకగా ఇచ్చింది. సెమీస్‌ రేసుకు చేరుకొని.. ఫైనల్‌ దాకా ఈ దరువు ఆగదని సవాల్‌ చేసి చెబుతున్నది.

తెలంగాణలో పొలిటికల్‌ దంగల్‌ హీట్‌ వరల్డ్‌ కప్‌ జోష్‌ కన్నా రెండింతలు పెరిగింది. హ్యాట్రిక్‌ విక్టరీకి కేసీఆర్‌ సేన సర్వసన్నద్ధమైంది. ఈ టీమ్‌లో అందరూ ఆల్‌ రౌండర్లే. వైరిపక్షాల విమర్శనాస్ర్తాలను బౌండరీలకు తరలించే పించ్‌ హిట్టర్లకు గులాబీ దండులో కొదవలేదు. తొడగొట్టే ప్రత్యర్థులను డకౌట్‌ చేసి డగౌడ్‌కు పంపటం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య.

ఇది తెలంగాణ టీమ్‌.. దీని కెప్టెన్‌ మన కేసీఆర్‌
ఆటలో అయినా, యుద్ధంలో అయినా గెలవాలంటే సేనాని బలంగా ఉండాలి. అప్పుడే సేన రఫ్ఫాడిస్తుంది. కేసీఆర్‌ మొండిఘటం. ఆయన తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించాకే అసాధ్యమనుకున్న ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది. ఆయన కెప్టెన్సీలోనే స్వరాష్ట్రం వరుస విజయాలు సాధిస్తున్నది. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన తెలంగాణ టీమ్‌ సారథి.. హ్యాట్రిక్‌ విజయం కోసం అడుగులు వేస్తున్నారు. ఈ కెప్టెన్‌ సాబ్‌ ఎంత దక్షత గలవాడో.. ఆయన జట్టులోని ఆటగాళ్లూ అంతే సమర్థులు. ఎన్నికల వేళ.. ఒకరు మతాబులా వెలిగిపోతారు. మరొకరు తారాజువ్వలా దూసుకుపోతారు. ఇంకొకరు చిచ్చుబుడ్డిలా చెలరేగుతారు. కేసీఆర్‌ జట్టులో ఆటగాళ్లు కోట్ల మంది. ఒక్కొక్కరూ కేసీఆర్‌ అంత పెట్టు. వారు బరిలోకి దిగితే ప్రత్యర్థి అస్త్ర సన్యాసం చేయడం ఖాయం.

ఫైనల్‌గా… ఈ పొలిటికల్‌ సమరంలో పోలింగ్‌ నాటికి బీజేపీ డకౌట్‌ అయితే, కాంగ్రెస్‌ రనౌట్‌ అయ్యేలా కనిపిస్తున్నది. బీఆర్‌ఎస్‌ సెంచరీ కొట్టి హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు పొలిటికల్‌ కామెంటేటర్లు. మొత్తంగా.. తెలంగాణ కప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడనున్న కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎం టైటిల్‌ కూడా సొంతం చేసుకోవడం ఖాయమని చెబుతున్నారు.

హిట్‌ మ్యాన్‌.. కేసీఆర్‌
కెప్టెన్‌ అంటే ధోనీ అంత కూల్‌గా ఉండాలి. రోహిత్‌లా హిట్‌ షాట్లు ఆడాలి. ఈ రెండు గుణాల మేలు కలయిక కేసీఆర్‌. 13 ఏండ్ల ఉద్యమ చరిత్రలో ఆయన ఒంటిచేత్తో విజయాలు సాధించిన సందర్భాలు అనేకం. ఈ సుదీర్ఘ సమరంలో టాస్‌ ఓడిపోయిన సన్నివేశాలూ ఎన్నో! చివరి బంతి వరకు ఉత్కంఠతో సాగిన మ్యాచులకైతే కొదవే లేదు. సూపర్‌ ఓవర్‌ దాకా వచ్చినవీ ఉన్నాయి. ప్రతి సందర్భంలోనూ కేసీఆర్‌ తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. సమైక్యవాదులు మాటల బౌన్సర్లు సంధిస్తే.. హుక్‌ షాట్‌లాంటి విమర్శలతో తిప్పికొట్టారు. మాయోపాయాల గూగ్లీలు వేస్తే.. తత్తరబిత్తర కాకుండా

చితక్కొట్టిన వైనమూ మనకు ఎరుకే!
2009 డిసెంబర్‌లో జరిగిన ఆసక్తికరమైన మ్యాచ్‌ గుర్తుందిగా! చివరి బంతికి సిక్స్‌ కొట్టాల్సిన పరిస్థితి. క్రీజ్‌లో కేసీఆర్‌. కాంగ్రెస్‌ విసిరిన ఆగ్నేయాస్ర్తాన్ని నిరాహార దీక్ష షాట్‌తో సిక్స్‌గా మలిచారు. చుక్కలనంటిన ఆ బంతి హస్తిన పార్లమెంట్‌లో పడింది. దెబ్బకు కేంద్రం దిగొచ్చింది. తెలంగాణ ఏర్పాటుపై స్పష్టతనిచ్చింది.

ఈ మ్యాచ్‌ చెల్లదంటూ తొండికి దిగారు సమైక్యవాదులు. అయినా వెనక్కి తగ్గలేదు కేసీఆర్‌. మళ్లీ ఆట మొదలైంది. ఒక్కోమ్యాచ్‌ గెలుచుకుంటూ.. తన కెప్టెన్సీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ.. 2014లో తెలంగాణ కప్‌ను అందుకున్నారు. తెలంగాణను అసాధారణ స్థాయిలో నిలిపారు. అదే ఉత్సాహంతో 2018లోనూ తెలంగాణ కప్‌ను అందుకున్నారు. తాజా సమరంలోనూ కేసీఆర్‌ దూకుడు తగ్గలేదు. ఏ బంతి విసిరితే ఏ షాటు కొడతాడో అని బిక్కచచ్చిపోతున్నారు ప్రత్యర్థులు. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ టోర్నమెంట్‌లో టాస్‌ వేయకముందే ప్రత్యర్థులు మ్యాచ్‌లు ఓడిపోతున్నారు. మన కెప్టెన్‌ సాబ్‌ మాత్రం వైరి జట్టును తక్కువ అంచనా వేయకుండా తెలంగాణ కప్‌ను మూడోసారి ముద్దాడటానికి మునుపటి ఫామ్‌తో దూసుకుపోతున్నారు.

‘పంచ్‌’ హిట్టర్‌ కేటీఆర్‌
జట్టులో ఒకరు సంయమనంతో వ్యవహరిస్తే.. మరొకరు కోహ్లీలా రెచ్చిపోవాలి. ఆటలో, మాటలో, తీరులో మెరుపువేగంతో దూసుకుపోవాలి. మన తెలంగాణ టీమ్‌ కోహ్లీ మరెవరో కాదు పంచ్‌ హిట్టర్‌ కేటీఆర్‌. కోహ్లీ ఆటలో కసి ఉంటే… కేటీఆర్‌ మాటలో పస కనిపిస్తుంది. ఈయన బ్యాటింగ్‌కు దిగితే.. అపొజిషన్‌ ఆటగాళ్లకు షివరింగ్‌ మొదలవుతుంది. గుడ్‌ లెంగ్త్‌ బంతిని కూడా గ్యాప్‌లోకి తరలించి బౌండరీ సాధించడంలో కేటీఆర్‌ సిద్ధహస్తుడు. ఆడేకొద్దీ ఆయన ఉత్సాహం రెట్టింపవుతుంది. బంతులు విసిరే బౌలర్లు అలసిపోవాలే గానీ, ఆయన ఉత్సాహం తగ్గదు. మంచి బంతిని గౌరవిస్తారు. చెత్త బంతిని శిక్షిస్తారు. ఎన్నో మ్యాచుల్లో మరుపురాని ఇన్నింగ్స్‌ ఆడి.. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అనిపించుకున్నారు.

ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌
జట్టు సమతూకంగా ఉండాలంటే ఒకరిద్దరు ఆల్‌రౌండర్లు కంపల్సరీ. తెలంగాణ టీమ్‌లో అలాంటి బుల్లెట్టే ఆరడుగుల హరీశ్‌రావు. బ్యాటింగ్‌కు దిగినప్పుడు కేఎల్‌ రాహుల్‌లా నింపాదిగా నిలబడి మారథాన్‌ ఇన్నింగ్స్‌ ఆడుతాడు. స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ.. తనతోపాటూ తన సహచరుడినీ ఆడిస్తాడు. బౌలింగ్‌కు దిగితే బుమ్రాలా విలక్షణ బాల్స్‌తో విపక్షాల వికెట్లు కూలదోస్తాడు. ఉద్యమం మొదలైన నాటి నుంచీ కెప్టెన్‌కు అండగా నిలిచిన ఆయన.. ఎన్నికల వేళ ట్రంప్‌కార్డ్‌ ఎత్తుగడలు వేయడంలో సిద్ధహస్తుడు. హరీశ్‌ ఉన్నచోట ఎలాంటి ట్రబుల్‌ అయినా దూదిపింజలా తేలిపోతుందని కెప్టెన్‌ కేసీఆర్‌ నమ్మకం. అందుకే, ఎక్కడ ఉప సమరాలు జరిగినా.. జట్టు బాధ్యతలు ఆయనకు అప్పగించి రిలాక్స్‌ అవుతారు.

గేమ్‌ చేంజర్‌ జగదీశ్‌
క్రికెట్‌లో పవర్‌ ప్లే తర్వాత ఆట కాస్త నెమ్మదిస్తుంది. ఆ సమయంలో ఫీల్డింగ్‌ జట్టు కాస్త రిలాక్స్‌ అయినా.. ప్రత్యర్థులు చాపకింద నీరులా స్కోర్‌ పెంచుకుంటూ పోతారు. అలాంటి సమయంలో కెప్టెన్‌ నమ్మకం ఉంచేది స్పిన్నర్లపైనే. టీమ్‌ ఇండియాలో రోహిత్‌ నమ్మకం చూరగొన్న బౌలర్‌ రవీంద్ర జడేజా! బౌలింగ్‌లో చకచకా బంతులేస్తూ, ప్రత్యర్థులకు ఆలోచించుకునే సమయం ఇవ్వడు. ఊరించే బంతులేసి, బ్యాటర్‌ను భారీ షాట్‌కు ప్రేరేపించి అవుట్‌ చేయడం అతనికి రివాజు. ఈ తరహా లక్షణాలను పుణికిపుచ్చుకున్న తెలంగాణ టీమ్‌ ఆటగాడు జగదీశ్‌ రెడ్డి. పెద్దగా విన్యాసాలు చేసినట్టు కనిపించరు. కానీ, ఒక్క బంతితో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగల దిట్ట.

యంగ్‌ బుల్లెట్‌ సుమన్‌
రోహిత్‌ సేనలో కొత్తగా చేరిన ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌. అతను ఆడుతున్నంత సేపూ పెవిలియన్‌లో మిగతా ఆటగాళ్లు సేఫ్‌గా ఫీలవుతుంటారు. తెలంగాణ టీమ్‌లో పాతకాపే అయినా.. యంగ్‌ బాల్క సుమన్‌ అలాంటి ఆటగాడే! ఈ చెన్నూరు చిన్నోడు మాటల కవర్‌ డ్రైవ్‌ ఎంతో సునాయాసంగా ఆడేస్తాడు. ఫీల్డింగ్‌లో మెరుపు వేగం ఇతని సొంతం. స్లిప్‌లో అతగాడు ఉన్నాడంటే అవతలి జట్టు బ్యాట్స్‌మెన్‌కు గుండెదడ తప్పదు. స్లెడ్జింగ్‌ చేయడానికీ వెనుకాడరు. కౌంటర్‌ అటాక్‌తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టి సునాయాసంగా వికెట్‌ సమర్పించుకునేలా చేస్తారు.

పదునైన బంతి వినోద్‌ కుమార్‌
క్రికెట్‌లో ఒక్కోసారి పిచ్‌ సహకరించని పక్షంలో స్కోర్‌ తక్కువగా నమోదవుతుంటుంది. ఆ పరిమిత పరుగులను కాపాడుకోవాల్సిన బాధ్యత బౌలర్లపై ఉంటుంది. అలాంటి సమయంలో షమీ వైపు చూస్తాడు కెప్టెన్‌ రోహిత్‌. రాజకీయ క్రీడలో కేసీఆర్‌ నమ్మకం పొందిన ఫాస్ట్‌ బౌలర్‌ వినోద్‌ కుమార్‌. అంతులేని సమాచారం ఆయన బలం. ఏ బంతిని ఎక్కడ పిచ్‌ చేయాలి, ఎంత హిట్‌ చేయాలి, ఎటు స్వింగ్‌ చేయాలి ఇవన్నీ ఉద్యమం నుంచే ఒంట బట్టించుకున్నారు వినోద్‌ కుమార్‌.

సూపర్‌ పర్ఫార్మర్‌ పువ్వాడ
ఈ వరల్డ్‌ కప్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ పర్ఫార్మెన్స్‌ అదిరిపోతున్నది. రోహిత్‌, కోహ్లీ విజృంభిస్తుండటంతో అయ్యర్‌ ఆట రిజిస్టర్‌ కావటం లేదు. ఖమ్మం హీరో పువ్వాడ అజయ్‌ కూడా అంతే! అక్కరకు వచ్చే వేళ చుక్కలా మెరిసిపోవడం ఆయన స్పెషాలిటీ. క్రీజులో కుదురుకుంటే.. విపక్షాల బంతులను చీల్చిచెండాడతారు. ప్రస్తుతం ఖమ్మంలో ఇన్నింగ్స్‌ ఆడుతున్నారు.

నిదానం నిరంజన్‌ విధానం
టీమ్‌ ఇండియాలో కుల్‌దీప్‌ తనదైన మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాడు. తెలంగాణ టీమ్‌లో ఆ పాత్రను అదే తరహాలో పోషిస్తున్నారు నిరంజన్‌రెడ్డి. కెప్టెన్‌ కేసీఆర్‌ ఇచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు పచ్చబడ్డ పాలమూరు మైదానంలోకి ప్రత్యర్థులను సమరానికి ఆహ్వానిస్తున్నారు. కరువు జిల్లా మారిన తీరు చూసిన ఆశ్చర్యంలో నుంచి ప్రత్యర్థి ఆటగాళ్లు తేరుకునేలోపు వాళ్ల వికెట్లు గిరాటు వేయగల సమర్థత నిరంజన్‌ సొంతం.

కొప్పుల.. విధ్వంసం..
వన్డే మ్యాచ్‌లోనూ టీ20 విధ్వంసం సృష్టించగల ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌. తెలంగాణ టీమ్‌లో అలాంటి ఆటగాడు కొప్పుల ఈశ్వర్‌. ఈ ధర్మపురి బ్యాట్స్‌మన్‌ అదును చూసి చెలరేగిపోతుంటారు. ప్రత్యర్థులకు ఓ పట్టాన చిక్కరు. వారిచ్చే క్యాచ్‌లను అస్సలు వదలరు. అందుకే, అపొజిషన్‌ నేతలు కొప్పుల ఉన్న చోట షాట్లు ఆడటం ఎందుకని ఫిక్సవుతుంటారు.

దూకుడు శ్రీనివాస్‌ మంత్రం
రోహిత్‌ సేనలో విలక్షణ ఆటగాడు సిరాజ్‌. లయ తప్పని వేగంతో అతగాడు విసిరే బంతులు ఆడాలంటే ఎంతటి బ్యాట్స్‌మన్‌ అయినా భయపడాల్సిందే. కొంత సంయమనం పాటిస్తూనే, అంతలోనే దూకుడుగా వ్యవహరించడం సిరాజ్‌ లక్షణం. తెలంగాణ టీమ్‌లో ఈ గుణాలను పుణికిపుచ్చుకున్న ఆటగాడు శ్రీనివాస్‌ గౌడ్‌. ప్రత్యర్థులకు అర్థం కాని బంతివేసి వికెట్‌ పడగొట్టడం ఆయనకు చిటికెలో పని.

అనుభవం పల్లా సొంతం
రోహిత్‌కు నమ్మకస్తుడు స్పిన్‌ దిగ్గజం అశ్విన్‌. మన కెప్టెన్‌ సాబ్‌ మనసు చూరగొన్న వ్యక్తి పల్లా రాజేశ్వర్‌రెడ్డి. తన వాక్చాతుర్యంతో, ప్రతిపక్షాల లోపాలను ఎండగడుతూ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఆయన జనగామతోపాటు పక్క నియోజకవర్గాల్లోని ప్రత్యర్థులను ఔట్‌ చేయగలరు.

Latest News

More Articles