Monday, May 20, 2024

మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి

spot_img

వరంగల్: మేడారంలోని సమ్మక్క ‌- సారలమ్మ అమ్మవార్లను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, పూజారులు కవిత కి ఘన స్వాగతం పలికారు. కవిత వెంట మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, బీఆర్ఎస్ నాయకురాలు బీ నాగజ్యోతి ఉన్నారు.

అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవార్లను దర్శించుకోడం సంతోషంగా ఉందన్నారు. మేడారం సమ్మక్క ‌- సారలమ్మ జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని, ఇది చేయగలిగిన అంశమేనని, కష్టమైన అంశం కాదని తెలిపారు. లక్షలాది మంది భక్తులు జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారని, ఇది లక్షాలాది మంది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

దక్షిణ భారత కుంభమేళగా చెప్పుకునే మేడారం జాతర తెలంగాణలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండడం అందరి అదృష్టమని అన్నారు. అటువంటి జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వాలని ఎంతో కాలంగా తాము డిమాండ్ చేస్తున్నామని, రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, ఎంపీలు, మంత్రులు అనేక సార్లు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మేడారం జాతరను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ ఏర్పడిన వెంటనే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రూ. 100 కోట్ల మేర నిధులిచ్చి మొదటి జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారని అన్నారు. ఆ తర్వాత ప్రతీ జాతరకు రూ. 75 కోట్లు ఖర్చు చేస్తూ మంచి ఏర్పాట్లు చేశామని వివరించారు. గత జాతరకు దాదాపు 3800 బస్సులను నడిపేలా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.

అయితే, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉండి ఆయా రకాల గొడవలయ్యి ప్రజలు అసౌకర్యానికి గురవుతున్న సందర్భాన్ని చూస్తున్నామని,  ఈ క్రమంలో జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా బస్సులు నడిపించాలని, జాతరకు బస్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి సూచన చేశారు. కాగా, గిరిజన విశ్వవిద్యాలయానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించిన విధంగానే కేంద్ర ప్రభుత్వం సమ్మక్క -‌ సారక్క పేరు పెట్టడం అందరూ సంతోషించతగ్గ విషయమన్నారు. గిరిజన విశ్వవిద్యాలయానికి బీఆర్ఎస్ హాయంలో భూమి ఇవ్వడమే కాకుండా రూ.  15 కోట్ల మేర నిధులు కూడా ఇచ్చామని గుర్తు చేశారు. రూ. 850 కోట్ల వ్యయంతో యూనివర్సిటీని నెలకొల్పడంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల కృషి ఎంతో ఉందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కృషి వల్ల రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ సంపద హోదా లభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటువంటి మంచి ప్రదేశాలు ఉన్నప్పుడు మన ప్రాంతాన్ని చరిత్రలో మన జిల్లా, రాష్ట్రం పేర్లను గౌరవంగా చాటిచెప్పేందుకు, సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు.

 

Latest News

More Articles