Monday, May 20, 2024

కారుదే జోరు.. తేల్చిచెప్పిన మరో జాతీయ సర్వే

spot_img

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రం మొత్తం రాజకీయంగా వేడెక్కింది. పార్టీలన్నీ తమతమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్.. తమ అభ్యర్థుల్ని ప్రకటించి.. రాకెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కూడా తన ప్రచారంలో వేగం పెంచారు. నియోజకవర్గాల వారీగా తిరుగుతూ.. క్యాడర్‎లో జోష్ పెంచుతున్నారు.

కాగా.. ఇప్పటికే పలు సర్వేలు బీఆర్ఎస్‎కే పట్టం కట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో జాతీయ సర్వే కూడా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకొని గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నదని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? గెలుపెవరది? అనే అంశంపై ‘జనతా కా మూడ్‌’ అనే జాతీయ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్‌ 1 నుంచి అక్టోబర్‌ 20వ తేదీ వరకు సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు వెయ్యి మంది చొప్పున మొత్తం 1.20 లక్షల ఓటర్ల అభిప్రాయాన్ని సేకరించింది. ఈ సర్వే ఫలితాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు భాస్కర్‌ సింగ్‌ బుధవారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సర్వేలో రాష్ట్రంలోని అత్యధిక మంది ఓటర్లు బీఆర్‌ఎస్‌కే జై కొట్టినట్టు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌ పాలనపై ప్రజలు నమ్మకంగా ఉన్నారని తేలింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని, తమకు మరింత మేలు జరగాలంటే మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడైంది.

Read Also: జడ్జీకి మరణశిక్ష విధించాలంటూ కోర్టులో పిటిషన్

జనతా కా మూడ్‌ సంస్థ చేపట్టిన సర్వేలో బీఆర్‌ఎస్‌ పార్టీ 72-75 సీట్లు గెలుచుకోబోతున్నదని తేలింది. తద్వారా తెలంగాణలో మరోసారి సారు.. కారు… సర్కారు ప్రభంజనం పునరావృతం కాబోతున్నదని స్పష్టమైంది. కాంగ్రెస్‌ పార్టీకి 31-36 సీట్లు మాత్రమే వస్తాయని తేలింది. అంటే కాంగ్రెస్‌తో పోల్చితే బీఆర్‌ఎస్‌కు రెట్టింపు సీట్లు వస్తుండటం గమనార్హం. ఇక బీజేపీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కానున్నది. ఈ పార్టీకి 4-6 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలో వెల్లడైంది. ఎంఐఎంకు 6-7 సీట్లు వస్తాయని సర్వే పేర్కొన్నది. ఓట్ల శాతం పరంగా గమనిస్తే… అత్యధిక ఓటర్లు బీఆర్‌ఎస్‌కు జై కొట్టారు. బీఆర్‌ఎస్‌ అత్యధికంగా 41 శాతం ఓట్లను దక్కించుకోనున్నదని సర్వేలో తేలింది. కాంగ్రెస్‌ పార్టీకి 34 శాతం ఓట్లు వస్తాయని వెల్లడైంది. ఎంఐఎంకు 3 శాతం, బీజేపీకి 14 శాతం, ఇతరులకు 8 శాతం ఓట్లు వస్తాయని సర్వే పేర్కొన్నది.

కేసీఆర్‌కు సాటి ఇతర పార్టీల్లో లేరు
జనతా కా మూడ్‌ సర్వేలో మరో ఆసక్తికరమైన అంశం వెల్లడైంది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు సాటి రాగల మరో లీడర్‌ లేరని ప్రజలు అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌కు దీటైన నాయకత్వం ఇతర పార్టీలో కనిపించడం లేదని తెలిపారు. కేసీఆర్‌ పాలనపై ప్రజలు అత్యధిక విశ్వాసాన్ని చూపుతున్నట్టు తేలింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన రైతు, మహిళా, బీసీల సంక్షేమ పథకాలపై ఎంతో సంతోషంగా ఉన్నట్టు ప్రజలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ అమలు చేసిన పథకాలు మోదీ సర్కారుకు మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు.

Latest News

More Articles