Friday, May 17, 2024

కేసీఆర్ ‘సింహగర్జన’కు 22 ఏండ్లు

spot_img

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ 2001 మే 17న కరీంనగర్‌లో నిర్వహించిన ‘సింహగర్జన’కు నేటితో 22 ఏండ్లు పూర్తవుతుంది. 2001 ఏప్రిల్‌ 27న జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ను స్థాపించిన కేసీఆర్‌.. సరిగ్గా 20 రోజులకు తొలిపోరుకు పిలుపునిచ్చారు.

కేసీఆర్ పిలుపునందుకున్న తెలంగాణ ఉద్యమకారులు.. లక్షలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అంటూ తీర్మానించారు. ఆ బహిరంగసభలో గంటసేపు చేసిన కేసీఆర్‌ ప్రసంగం తెలంగాణ చిరిత్రలో మిగిలిపోయింది. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చెప్పడమే కాదు, తెలంగాణ రాష్ట్రం – సాధన విషయంలో ఉన్న అపోహలను కూడా నివృత్తి చేశారు.

22 ఏండ్ల కేసీఆర్‌ ప్రస్థానం… నేటి తెలంగాణ ప్రగతికి ప్రతిబింబంగా కనిపిస్తోంది. తెలంగాణను ఇలా సాధిస్తానంటూ చెప్పిన కేసీఆర్.. సరిగ్గా  13 ఏండ్ల తర్వాత నిజం చేశారు. తెలంగాణ అభివృద్ధిపై చెప్పిన మాటల్ని.. రాష్ట్రం వచ్చిన పదేండ్లలో నిజం చేసి కండ్ల ముందుంచారు. నాడు తెలంగాణ ఉద్యమం.. నేడు తెలంగాణ విజయ నాదం దేశమంతా ప్రతిధ్వనిస్తున్నది.

ప్రత్యేక రాష్ట్రంలో నేడు అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్న వారికి, విమర్శిస్తున్న బట్టేబాజీగాళ్లకు 22 ఏండ్ల క్రితం కేసీఆర్‌ ఏమన్నాడో… ఎలా దాన్ని సాధించి చూపెట్టాడో విస్మరించారు. కేసీఆర్  కు ఎంత ముందు చూపు ఉన్నదో ఆనాడు కరీంనగర్ సభలో చేసిన ఒక్కో వ్యాఖ్య.. నేడు ఎలా నిజమైందో తెలుస్తుంది.

కేసీఆర్ ప్రసంగం ముఖ్యంశాలు:

‘‘నా ప్రాణం పోయినా సరే.. ప్రత్యేక తెలంగాణను సాధించి తీరుతా’’, ‘‘ఉద్యమానికి వెన్నుపోటు పొడిచే సమస్యే లేదు. వెనక్కి తగ్గితే రాళ్లతో కొట్టి చంపండి’’,  ‘‘తెలంగాణ సమాజం సహకారం, మద్దతు అందిస్తే శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రత్యేక రాష్ట్రం సాధించి తీరుతాం’’, ‘‘ఉద్యమ నిర్మాణంలో చిత్తశుద్ధి చూపని నాయకులను నిలదీసే విధంగా తెలంగాణ ప్రజానీకంలో చైతన్యం తీసుకురావడం మా లక్ష్యం’’,  ‘‘గత 44 ఏండ్ల చరిత్రలో తెలంగాణకు ఏ రంగంలో చూసినా పూర్తిగా అన్యాయమే జరిగింది’’, ‘‘అనేక ప్రజా ఉద్యమాలకు నిలయమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే వరకు ఈ ఉద్యమం ఆగదు’’,  ‘‘తెలంగాణ చరిత్రను, సంస్కృతిని వక్రీకరిస్తున్నారు. తెలుగు సినిమాల్లో విలన్లకు, జోకర్లకు తెలంగాణ యాసను ఉపయోగిస్తున్నారు. మన సంస్కృతి, భాషను అవహేళన చేస్తున్నారు’’, ‘‘తెలంగాణకు చెందిన మొత్తం 107 మంది ఎమ్మెల్యే లు ఏకాభిప్రాయంతో ఉన్నా మిగతా ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తే తీర్మానానికి అవకాశమే ఉండదు’’, ‘‘అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని గుజరాత్‌ ఏర్పాటు సమయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది’’,  ‘‘తెలంగాణ ప్రజలకు ఇంకుడు గుంతలు, కోస్తా ప్రజలకు నదులు, కాల్వలా?’’, ‘‘ఢిల్లీ సర్కారే మన కాళ్ల వద్దకు వచ్చి తెలంగాణ రాష్ర్టాన్ని ఇస్తుంది’’, ‘‘వెయ్యిమంది చంద్రబాబు నాయుడులు అడ్డు వచ్చినా తెలంగాణ ఏర్పాటును ఆపలేరు’’, ‘‘ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో జారీ చేసిన జీవో 610ను నేటికీ అమలు చేయటం లేదు. ఇతర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు 60 వేల మంది తెలంగాణలో ఉన్నారు’’, ‘‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సాధ్యమే. పొరుగు రాష్ట్రం గత పదేండ్లుగా ఇస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు’’, ‘‘త్యాగాల వల్లే ఉద్యమాలు నిలుస్తాయని నమ్మి నా పదవులను గడ్డిపోచలా వదులుకున్నా’’, ‘‘వ్యూహాత్మకంగా ముందుకు సాగి రాష్ట్రం సాధించుకోవలసి ఉంది. ఆవేశం ముఖ్యం కాదు. ఆలోచన అవసరం’’, ‘‘తెలంగాణ రక్తంలో వాడివేడి ఉన్నాయే తప్ప వెన్నుపోటు గుణం లేదు. మాది రాష్ట్రం కోసం పోరాటమే తప్ప వీధుల్లో రాళ్లు విసిరే నైజం కాదు’’, ‘‘నేను బక్కపల్చగా ఉండవచ్చు కానీ మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజల మద్దతే నాకున్న బలం’’, ‘‘ఇన్నేండ్లుగా దగా పడ్డ తెలంగాణ ఇక మౌనంగా ఉండలేదు. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించే వరకు మూడుకోట్ల ప్రజలు సింహాలై గర్జిస్తారు’’ అని సింహగర్జన సభలో కేసీఆర్‌ విశ్లేషాత్మక, ఆలోచన రేకెత్తించేలా చేసిన వ్యాఖ్యలు.. అనంతరం కాలంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు దోహదం చేశాయి.

Latest News

More Articles