Monday, May 20, 2024

ప్రాణాలు తీసిన చలి కుంపటి.. ఊపిరాడక ఐదుగురు చిన్నారులు మృతి

spot_img

చలికి తట్టుకోలేక ఇంట్లో వేసుకున్న చలిమంట వారి ప్రాణాలనే మింగింది. రాత్రిపూట భోజనం చేసి నిద్రపోయిన కుటుంబంలో.. తెల్లారేసరికి ఐదుగురు చిన్నారులు విగతజీవులుగా మారారు. మరో ఇద్దరు పెద్దవారు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‎లోని అమ్రోహా జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది.

Read Also: అభయహస్తం కోసం సోనియా గాంధీ దరఖాస్తు! కొడుకులుగా రేవంత్, భట్టి, ఉత్తమ్..

సోమవారం రాత్రి మూసుకున్న ఇంటి తలుపులు మంగళవారం సాయంత్రం కావొస్తున్నా తెరుచుకోకపోవడంతో ఇరుగు పొరుగు వారు అనుమానించారు. బలవంతంగా డోర్లు తెరిచి లోపలికి వెళ్లి చూడగా.. కుటుంబం మొత్తం నిద్రలోనే ఉన్నారు. అందులో ఐదుగురు పిల్లలు అప్పటికే చనిపోయినట్లు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో ఇద్దరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదం జరిగిన ఇంటి యజమాని పేరు రహీజుద్దీన్ అని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ముగ్గురు పిల్లలు రహీజుద్దీన్ సంతానం కాగా మిగతా ఇద్దరు బంధువుల పిల్లలని చెప్పారు. ఈ ఘటనలో రహీజుద్దీన్ భార్యతో పాటు అతని తమ్ముడు చావుబతుకుల్లో ఉన్నారని పేర్కొన్నారు.

ఇంట్లో వెచ్చదనం కోసం పెట్టుకున్న కుంపటి వల్లే పిల్లలు ప్రాణాలు పోయినట్లు పోలీసులు చెప్పారు. గదిలోకి గాలి వచ్చే మార్గం లేకపోవడం, కుంపటి నుంచి వెలువడిన కార్బన్ డయాక్సైడ్ కారణంగా గాలిలో ఆక్సిజన్ స్థాయులు తగ్గి ఉండొచ్చని అంటున్నారు. అందువల్లే పిల్లలు ఊపిరి ఆడక నిద్రలోనే కన్నుమూశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

Latest News

More Articles