Monday, May 20, 2024

పెళ్లిచూపులకు వెళ్లి అడ్డంగా దొరికిపోయింది నకిలీ మహిళా ఎస్ఐ

spot_img

ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనేది చాలా మంది లక్ష్యంగా పెట్టుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడి, పట్టుదలతో చదివి డ్రీమ్​ను నెరవేర్చుకోవాలంటే అంత ఈజీ కాదు. అయితే కొందరు ఎంత కష్టపడినా విజయానికి ఆఖరి మెట్టు వరకు వచ్చి ఆగిపోవచ్చు. అయితే ఓ మహిళ ప్రభుత్వ ఉద్యోగం రాకపోయినా వచ్చినట్లు అందరినీ నమ్మించింది. కొంత కాలం తర్వాత అసలు విషయం కాస్తా బయటపడింది.

నల్గొండ జిల్లాలోని నార్కట్​పల్లికి చెందిన జడల మాళవిక అనే యువతి నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్సై ఎగ్జామ్ రాసింది. రాతపరీక్షలో పాసైన మాళవిక.. మెడికల్ టెస్టులో మాత్రం క్వాలిఫై కాలేదు. కంటి సమస్య ఉండటంతో ఆమెను పక్కనపెట్టారు. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పని ఆ యువతి.. తనకు జాబ్ వచ్చిందని అందర్నీ నమ్మించింది. శంకర్​పల్లిలో ఆర్పీఎఫ్​ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నానని చెప్పింది. ఇందులో భాగంగానే నకిలీ ఐడీ కార్డు సహా యూనిఫామ్​ను రెడీ చేసుకుంది. ప్రతి రోజు పోలీసు యూనిఫామ్ ధరించి డ్యూటీకి వెళ్తున్నట్లుగా చెప్పి బయటకు వెళ్లొచ్చేది.

పోలీసు యూనిఫామ్​లోనే పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకుంది మాళవిక. ఈ క్రమంలోనే ఇంట్లో వాళ్లు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడసాగారు. అయితే ఆ పెళ్లిచూపులకు కూడా మాళవిక యూనిఫామ్​లోనే వెళ్లింది. తాను ఆర్పీఎఫ్ ఎస్సైను అని వాళ్లకు పరిచయం చేసుకుంది. ఎంత పోలీసైతే మాత్రం పెళ్లి చూపులకు యూనిఫామ్​లో రావడం ఏంటని అబ్బాయి తరఫు వారికి  అనుమానం వచ్చింది. అంతే ఆమె గురించి తెలిసిన వారి దగ్గర, అలాగే డిపార్ట్​మెంట్​లో ఎంక్వైరీ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఉన్నతాధికారులను సంప్రదించగా మాళవిక ఎస్సై కాదని..అసలు అలాంటి పేరుగల వాళ్లు తమ డిపార్ట్ మెంట్ లో లేరేని తెలిపారు. ఈ విషయం తెలిసిన పోలీసులు నకిలీ ఎస్సైగా చలామణి అవుతున్న ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగం రాదని తెలిస్తే తన పేరెంట్స్ బాధపడతారనే ఉద్దేశంతోనే ఈ పని చేశానని ఎంక్వైరీలో మాళవిక చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: అప్పుల్లో ఉన్నారా.. ఇక్కడికి వెళ్తే వెళ్తే చాలు అన్ని తీరిపోతాయట

Latest News

More Articles