Saturday, May 18, 2024

బీజేపీకి భారీ షాక్.. కరీంనగర్ సీనియర్ లీడర్ రాజీనామా

spot_img

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కరీంనగర్ బీజేపీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ రాజకీయవేత్త, క‌రీంన‌గ‌ర్ జిల్లా సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి శుక్రవారం పంపించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీలో జరుగుతున్న పరిణామాలు నిశితంగా పరిశీలించిన మీదట, ఇకపై పార్టీలో కొనసాగలేనని, అందుకే బీజేపీ నుంచి వైదొలుగుతున్నట్టు కటుకం పంతులు త‌న రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

మృత్యుంజయం 2019లో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రోద్బలంతో పార్టీలో చేరారు. అయితే ఆయనకు ఎటువంటి హోదా ఇవ్వనప్పటికీ వివిధ ఎన్నికల్లో పార్టీ ఆదేశం మేరకు అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తిరువన్నామలై నియోజకవర్గ ఇంఛార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంఛార్జీగా కూడా పనిచేశారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కొన్ని డివిజన్లకు ఇంఛార్జీగా వ్యవహరించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇంఛార్జీగా పనిచేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో కూడా కొన్ని మండలాలకు ఇంఛార్జీగా విధులు నిర్వర్తించారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన ఆయన.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. ఆ రెండు పార్టీలలో పనిచేసిన ఆయన.. ప్రస్తుతం ఏ పార్టీలో చేరుతారనే విషయం చర్చనీయాంశంగా మారింది. కాగా.. కటకం రాజీనామాతో బండి సంజయ్‎కు స్థానికంగా గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

Latest News

More Articles